Tirumala : తిరుమలలో భక్తుల కిటకిట.. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్ వెలుపలకు

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. క్యూ లైన్‌లన్నీ నిండిపోయి బయట వరకూ భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు

Update: 2024-03-15 05:47 GMT

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వీకెండ్ కు ముందు రోజు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో కంపార్ట్‌మెంట్లు దాటి క్యూ లైన్ వెలుపల వరకూ వచ్చాయి. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు వస్తుండటంతో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే వసతి గృహాలు దొరుకుతున్నాయి. మరోవైపు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకు మూడు నుంచి నాలుగు గంటలు శ్రీవారి దర్వనం పడుతుంది.

ఆన్‌లైన్ లో జులై టిక్కెట్లు...
ఈ నెల 18వ తేదీ నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లను 18న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 27వ తేదీ వరకూ ఆన్ లైన్ లో భక్తులకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లతో పాటు వసతి గృహాల టిక్కెట్లను కూడా ఆన్ లైన్ ఉంచుతామని, భక్తులు గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.
భక్తులతో నిండిపోయి...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బయట వరకూ ఉండటంతో స్వామి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. సర్వదర్శనానికి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు పద్దెనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 48,444 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,266 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.71 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News