Ap Rain Alert : ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు.. అలెర్ట్ గా ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరోసారి తుపాను పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

Update: 2024-11-23 02:52 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరోసారి తుపాను పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారి, తర్వాత తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తుపాను ముప్పు ఏపీ ప్రజలకు పొంచి ఉందని తెలిపింది. దక్షిణ అండమాన్ లో గురువారం ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

రెండు జిల్లాల్లో...
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. తుపాను శ్రీలంక వైపు పయనించే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయినా సరే ఏపీలో అతి భారీ నుంచి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. నదులు, వాగులు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మత్స్య కారులు చేపలవేటకు వెళ్లకూడదని కూడా తెలిపింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావడం మంచిదని కూడా తెలిపింది.
బలమైన ఈదురుగాలు...
అదే సమయంలో ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయిని తెలిపింది. గంటలకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రైతులు తమ పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడుకునేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని, వరికోతలు ప్రారంభం కావడంతో ధాన్యాన్ని సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలని పేర్కొంది. పశువుల కాపర్లు పొలాలకు వెళ్లినప్పుడు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.




Tags:    

Similar News