చినుకుపడితే.. బీసెంట్ రోడ్డు

చిన్న పాటి వర్షం వస్తే చాలు విజయవాడలోని బీసెంట్ రోడ్డు, గవర్నర్‌పేట రోడ్డులు వర్షపు నీటితో మునిగిపోతున్నాయి

Update: 2023-05-02 12:12 GMT

చిన్న పాటి వర్షం వస్తే చాలు విజయవాడలోని బీసెంట్ రోడ్డు, గవర్నర్‌పేట రోడ్డులు వర్షపు నీటితో మునిగిపోతున్నాయి. అనేక సార్లు రహదారులు వేసినా ప్రయోజనం లేదని స్థానికులు చెబుతున్నారు. వర్షపు నీటితో తమ వ్యాపారాలు సాగడం లేదని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మురుగు కాలువలు నిర్మించినా ప్రయోజనం లేదని చెబుతున్నారు. వర్షం కురిస్తే తమ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని చెబుతున్నారు.

ప్రభుత్వం పట్టించుకోక...
పన్నులు వసూళ్లు తప్ప , సౌకర్యాలు కల్పనపై నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీసెంట్ రోడ్డు, గవర్నర్‌పేటలను పట్టించుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బీసెంట్ రోడ్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సీపీఎం నిరసన...
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే వ్యాపార పరంగా ప్రసిద్ధిగాంచిన విజయవాడ, బీసెంట్ రోడ్,గవర్నర్ పేట చిన్నపాటి వర్షాలకే ముంపుకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ మురుగునీరు పొంగిపొర్లుతోందని, ప్రజలు నడవలేని దుస్థితి ఉందని తెలిపారు. వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, చిరు వ్యాపారులు తమ సామాగ్రి దెబ్బతిని అన్ని విధాలా నష్టపోతున్నారని ఆయన అన్నారు. 450 కోట్ల రూపాయల ఖర్చుతో మురుగు కాలువ నిర్మాణం చేపట్టినా ఫలితం లేదన్న బాబూరావు దోమల తీవ్రత మరింత పెరిగిందన్నారు. బీసెంట్ రోడ్డు ఆధునీకరణపై నగరపాలక సంస్థ పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దోమల బెడత నుంచి ఈప్రాంత వాసులను కాపాడాలని కోరారు.


Tags:    

Similar News