Andhra Pradesh : పవనూ.. మత్స్యకారులను పట్టించుకోరా? అధికారంలోకి వచ్చాక ఇదేంది సామీ?
ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండిలేక అవస్థలు చెందుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండిలేక అవస్థలు చెందుతున్నారు. వరసగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాను కారణాలతో ఎక్కువ రోజులు చేపల వేటకు దూరంగా ఉంటున్నారు. మత్స్యకారుల చేపలవేటపై నిషేధం విధిస్తుండటంతో వలలు గట్టున పడేసి ఇళ్లకే పరిమితమవుతున్నారు. చేపల వేట లేకపోవడంతో ఉపాధి దొరకడం లేదు. దీంతో మత్స్యకారులు కడుపు నింపుకోవడానికి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇటు చేపల వేట లేక.. అటు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సర్కార్ కు వీడి గోడు మాత్రం పట్డడం లేదు. మరో 36 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
సుదీర్ఘ కోస్తా తీరం...
ఆంధ్రప్రదేశ్ లో 900 కిలోమీటర్లకు పైగా కోస్తా తీరం ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ సముద్రం విస్తరించి ఉంది. ఇక్కడ వేలాది మంది మత్య్యాకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎక్కువ మంది చేపల వేట చేసి పొట్టను పోషించుకుంటున్నారు. తమ తాత తండ్రుల నాటి నుంచి అదే వృత్తి. ఒకరోజు చేపలవేటకు వెళితే సముద్రంలో వారి ప్రయాణం సాహసమే. తిరిగి ఒడ్డుకు చేరుకునేంత వరకూ అనుమానమే. మధ్యలోనే ప్రాణాలు సముద్రంలో కలిసిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏమాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసినా ఇక మత్స్యకారులను చేపలవేటకు వెళ్లనివ్వకుండా నిషేధం విధిస్తారు.
చేపల వేటపై నిషేధంతో...
ఈ మధ్య కాలంలో దాదాపు ఇరవై రోజుల నుంచి చేపలవేటకు వెళ్లకుండా నిషేధం విధించారు. దీంతో మత్స్యకారులు ఉపాధి కరువై తల్లడిల్లిపోతున్నారు. ఒడ్డున పడ్డ చేపల్లా గిలాగిలా కొట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల సంక్షేమాన్ని కూడా మర్చిపోయినట్లుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖ మత్స్యకారుల వద్దకు వెళ్లి వారికి ఆర్థిక సాయం కూడా అందించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విస్మరించారు. కనీసం వారికి మత్స్యకారుల భరోసా నిధులు విడుదల చేయకపోవడంతోపదిహేనురోజులుగా తిండిలేక ఇబ్బందిపడుతున్నారు. చేపల వేటకు వెళ్లలేక, ప్రభుత్వం నుంచి సాయం అందంక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మత్స్యకారులను ఆదుకునే ప్రయత్నం చేయవా పవనూ అంటూ బిక్కమొహాలు వేసుకుని చూస్తున్నారు.