Rain Alert : ఏపీ వాసులకు హై అలెర్ట్...వర్షం కురిసే ఏరియాలేవంటే?
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల త్వరలోనే అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. రానున్న ముప్ఫయి ఆరు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. ప్రజలు భారీ వర్షాల వల్ల కొన్ని నదులు, వాగులు ఉప్పొంగే ఛాన్స్ ఉందని తెలిపింది. వాగులు దాటే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు.
అల్పపీడన ప్రభావంతో...
రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు వైపు వెళుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం కురిసే అవకాశముందని, అనేక చోట్ల ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. పొలాల్లో ఉండే పశువుల కాపర్లు, ఇతరులు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో వరసగా వర్షాలు పడుతుండటంతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు, మత్స్యకారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
మూడు రోజుల పాటు...
మత్స్యకారులు అల్పపీడన ప్రభావం కారణంగా చేపలవేటకు వెళ్లవద్దని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి విస్తరించి ఉన్నందున ఎల్లుండి నుంచి వానలు వరసగా మూడు రోజుల పాటు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 11న రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వరికోతల సమయం కావడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు దాటకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ను వర్షం వదిలేలా కనిపించడం లేదు.