Talliki Vandanam : అమ్మఒడి దక్కిన అందరికీ దక్కే అవకాశం తల్లికి వందనంలో లేదు.. రీజన్ ఇదే
ప్రజలు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం ఎంతమందికి దక్కుతుందన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది;

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలకు పైగానే అవుతుంది. ఇప్పటి వరకూ ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అది అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి అయితే నెలకొంది. అసలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. కొన్ని హామీలకు డేట్స్ వచ్చేసినా ఎంతమందికి ఇస్తారో తెలయని పరిస్థితి. ఎందుకంటే తాము లబ్దిదారులమయ్యేంత వరకూ ప్రజల కంటి మీద కునుకు లేకుండా పోతుంది. వివిధ కొర్రీలతో అధికారులు అనేక మందిని పింఛన్లనే తొలగిస్తుండటంతో ఇక ప్రజలు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం ఎంతమందికి దక్కుతుందన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది. ఆందోళనకు దారితీస్తుంది.
గత ప్రభుత్వంలో...
గతంలో తమకు అమ్మఒడి దక్కిందని ఈసారి తల్లికి వందనం దొరుకుతుందని ఆశించడం కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది అనర్హులను ఈ పథకంలో చేర్చిందని కూటమి పార్టీలు ఇప్పటికే విమర్శలు ప్రారంభిచండంతో ప్రజల్లో అలజడి ప్రారంభమయింది. ఈ నేపథ్యంలోనే తల్లికి వందనం పథకం చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు మొన్నటి బడ్జెట్ లో లో నిధులు కేటాయింపులు చేసింది. 9,407 కోట్ల రూపాయలను కేటయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. మే నెల నుంచి లబ్దిదారుల ఖాతాలో డబ్బులు పడనున్నాయి.
పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి...
ఇప్పటికే లబ్దిదారు ఎంపిక ప్రక్రియ ప్రారభం కావడం, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి ఈ పథకానికి సంబంధించిన నిధులు జమ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలోనూ చెప్పడంతో ఇప్పుడు అసలు టెన్షన్ జనాల్లో మొదలయింది. అయితే చాలినంత నిధులు కేటాయింపులు జరపలేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అందరికీ ఇవ్వాలంటే పన్నెండు వేల కోట్లకు పైగానే నిధులు వెచ్చించాల్సి ఉండగా, తొమ్మిదివేల కోట్లు ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఎంతమందికి కోత పెడతారు? అందులో తాము ఉంటామా? లేదా? ఆ జాబితా ఎప్పుడు బయటపెడతారు? అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింద.ి
పథకం దక్కాలంటే?
తల్లికి వందనం పథకం దక్కాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు తో పాటు ఆధార్ కార్డు ఉండాలి. దీనిపై అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. వివిధ పథకాలు పొందే వారితో పాటు అర్హత కలిగిన వారిని ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వం హాజరు శాతం కూడా 75 శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంది. తెలుపు రంగు రేషన్ కార్డు తప్పనిసరి. కుటుంబంలో ఏఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదు. అలాగే కారు ఉన్నా, విద్యుత్తు అధిక వాడకం ఉన్నా లబ్దిదారులగా ఎంపిక కారు. దీంతో పాటు సంవత్సరాదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో తల్లికి వందనం పథకం తమకు అందుతుందా? లేదా? అన్న టెన్షన్ లో జనం ఉన్నారు.