Ys Jagan : గోకితే.. కక్కకుండా ఎలా ఉంటరయ్యా జగనూ?
వైసీపీ అధినేత జగన్ కు సొంత పార్టీలో పనిచేసిన వారే శత్రువులుగా మారుతున్నారు.;

వైసీపీ అధినేత జగన్ కు సొంత పార్టీలో పనిచేసిన వారే శత్రువులుగా మారుతున్నారు. వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడటంతోనే వారు నిజాలు బయటపెడుతున్నారు. వారే ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు చేస్తుండటంతో అందుకు బలమైన ఆధారాలను బయటపెడుతూ జగన్ ను కొంత డైలమాలో పడేస్తున్నారు. బాలినేని శ్రీనివాసులురెడ్డి, విజయసాయిరెడ్డి, లావు శ్రీ కృష్ణ దేవరాయలు వీళ్లు ముగ్గురు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారే. వీరిలో ఒకరు మంత్రి పదవి చేపట్టగా, మరొకరు ఎంపీగా గెలిచారు. మరొకరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే వీరు చేస్తున్న ఆరోపణలకు టీడీపీకి ఊతమిచ్చినట్లయింది. ఎందుకంటే కొన్నేళ్ల పాటు పార్టీలో ఉండి దగ్గరగా చూసిన వ్యక్తులు కావడంతో వారు చెప్పే మాటలను కూడా ప్రజలు విశ్వసించే అవకాశముంది.
సాయిరెడ్డిని అన్న తర్వాత....
అయితే వెళ్లిన నేతలను గెలుకుతున్నందునే వారు విమర్శలు చేస్తున్నారంటున్నారు. విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కూడా జగన్ విషయంలో ఆయన మాట తూలలేదు. తనకు రెండు సార్లు రాజ్యసభ పదవి ఇచ్చిన జగన్ కు ధన్యావాదాలు సాయిరెడ్డి తెలిపారు. వైఎస్ కుటుంబం అంటే వల్లమాలిన ప్రేమ అని కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత జగన్ ఒక మీడియా సమావేశంలో సాయిరెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించాయని అంటున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా భయపడితే.. బెదిరిస్తే.. ప్రలోభాలు చూపితే లొంగిపోతే ఎలా అని ప్రశ్నించారు. దీంతో సాయిరెడ్డికి కాలి మద్యం కేసులో ఉన్న విషయాలను కక్కేసారు. సాయిరెడ్డి విషయాన్ని జగన్ ప్రస్తావించకపోయి ఉంటే ఈ విషయాన్ని ఆయన బయటపెట్టి ఉండేవారు కాదంటున్నారు.
లావు శ్రీ కృష్ణదేవరాయలు కూడా...
ఇక నరసరావుపేట ఎంపీగా పనిచేసిన లావు శ్రీ కృష్ణదేవరాయలు కూడా అంతే. ఆయన పార్టీ మారి టీడీపీలో చేరినా తన పని తాను చేసుకుంటున్నారు. పెద్దగా విమర్శలు చేయడం లేదు. జగన్ పేరు ఎక్కడా లావు శ్రీ కృష్ణదేవరాయలు ఈ పదినెలల కాలంలో ప్రస్తావించలేదు. గత ఐదేళ్లలో జరిగిన విషయాలను కూడా బయట పెట్టలేదు. తన మానాన తన పని చేసుకుని పోతున్న లావు శ్రీ కృష్ణదేవరాయలను మాజీ మంత్రి విడదల రజనీ గెలికారు. తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని, లావుపై ఆరోపణలు రజనీ చేయడంతో ఆయన వెంటనే లోక్ సభలోనే మద్యం కుంభకోణం జరిగిందని, రెండు వేలకోట్లు దుబాయ్ తరలించినట్లు చెప్పారు. అంతటితో ఆగకుండా నేరుగా అమిత్ షాను కలసి ఈడీ అధికారుల చేత సోదాలను నిర్వహించాలని కూడా కోరారు. ప్రస్తుతం మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది.
మద్యం కుంభకోణంలో...
మద్యం కుంభకోణం విషయంలో జగన్ కు ప్రధాన శత్రువులుగా మారింది సొంత పార్టీ నేతలే. తొలుత విజయసాయిరెడ్డి ఈ విషయం బయటపెట్టారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును విజయసాయిరెడ్డి బయట పెట్టారు. తర్వాత లావు వచ్చి ఎన్ని నిధులు చేతులు మారింది చెప్పారు. ఇక బాలినేని కూడా తన డిజిటల్ సంతకాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకున్నారని కూడా ఆరోపించారు. బాలినేని విషయంలోనూ గెలుక్కోవడంతో పాటు ఆయనను వైసీపీ నేతలు టార్గెట్ చేయడంతో శ్రీనివాసులు రెడ్డి కూడా బయటపడ్డారు. ఇంకా చాలా విషయాలు బయటపెడతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇలా ఎలా చూసినా కెలుక్కోవడం ఎందుకు? కక్కించుకోవడం ఎందుకు? అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది.