Summer Effect : ఇంట్లో ఉన్నా ఉక్కపోత.. బయటకు వెళితే వడ దెబ్బ.. ఎక్కడున్నా ఇబ్బందులే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. నిన్నటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి;

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. నిన్నటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మళ్లీ నలభై డిగ్రీలను అనేక ప్రాంతాల్లో దాటేసింది. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎంత తీవ్రంగా ఉందంటే ఎండలోకి బయటకు వచ్చామంటే ఇంటికి వెళ్లి ఖచ్చితంగా స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం పొడి వాతావరణంతో పాటు వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఒక రకమైన హ్యుమిలేషన్ కు ఫీలవుతున్నారు. బయట తిరగే వారికంటే ఇళ్లలో ఉండే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. హైదరాబాద్ లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
ఇంట్లో ఉన్నా...
ఫ్యాన్లు వేసుకున్నా వేడిగాలుల తీవ్రత పెరిగింది. నిన్నటి నుంచి ఏసీల వాడకం మరింతగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ అనేక జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఎంత ఎండతీవ్రత అంటే దూర ప్రయాణాలు చేసే వారు కూడా ఎండలను చూసి మానుకుంటున్నారు. అనేక రైళ్లలో ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న సీట్లను కూడా రద్దు చేసుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలకు, పర్యాటక స్థలాలకు వెళ్లే వారు కూడా ఎండలను చూసి భయపడి ఈ ఎండల దెబ్బకు ఇప్పుడు వెళ్లడం అనవసరమని భావించి ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఇక బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గిందని రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ సంస్థలు చెబుతున్నాయి. కేవలం ఏసీ బస్సుల్లో మాత్రమే ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజురోజూకు పెరుగుతుందని, రాత్రివేళ ప్రయాణం ఎక్కువగా చేస్తున్నారంటున్నారు.
తెలంగాణాలోనూ...
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీయడం కూడా ప్రారంభమయింది. ఏపీలోని దాదాపు రెండు వందలకు పైగా మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో తెలంగాణలోనూ ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి పోవడంతో ప్రజలు పగటి వేళ బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.