Perni Nani : పేర్ని నాని డీలా పడ్డారా? మీడియా సమావేశంలోనే కనపడిందిగా?

మాజీ మంత్రి పేర్ని నాని ఎప్పుడూ ఫైరింగ్ లో ఉంటారు. కానీ ఈరోజు మీడియా సమావేశాన్ని చూస్తూ మాత్రం ఆయన డీలా పడినట్లు కనిపించింది

Update: 2024-12-28 12:14 GMT

మాజీ మంత్రి పేర్ని నాని ఎప్పుడూ ఫైరింగ్ లో ఉంటారు. కానీ ఈరోజు మీడియా సమావేశాన్ని చూస్తూ మాత్రం ఆయన డీలా పడినట్లు కనిపించింది. బేలతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. తన భార్య జయసుధపై కేసు నమోదు చేశారంటూ ఆయన ఆవేదన చెందినప్పటికీ ఆయన తీరు చూసిన మీడియా మిత్రులకు కూడా ఒకింత ఆశ్చర్యం కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దూకుడుగా అనేక మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి నాని తన మాటలతో అధికార పార్టీని ఇబ్బంది పెట్టేటట్లు మాట్లాడే వారు. అలాగే అనేక రకాలుగా సెటైర్లు వేస్తూ, జోకులు పేల్చుతూ, ఎదుటి వారిని హేళన చేస్తూ మాట్లాడే పేర్నినాని చాలా రోజుల తర్వాత సీరియస్ గా పెట్టిన మీడియా సమావేశం ఇదే కాబోలు.


వాగ్దాటి ఉన్ననేతగా...

పేర్నినాని మీడియా సమావేశం చూసిన వారికి ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. పేర్ని నాని నిజంగానే మంచి వాగ్దాటి ఉన్న నేత. చెణుకులతో, మాట విరుపులతో అందరినీ ఆకట్టుకునే వారు. ప్రత్యర్థులకు చికాకు పుట్టించే విధంగా మాట్లాడే పేర్ని నాని తన భార్యపై నమోదయిన కేసుతో కొంత డీలా పడినట్లే కనిపిస్తుంది. తాను ఎక్కడికి పారిపోలేదంటూనే తాను అరెస్ట్ కు సిద్ధమంటూ ఆయన అంటున్నారు. అదే సమయంలో ఇళ్లల్లో మహిళలను లాగడమేంటని ప్రశ్నిస్తూ తన భార్య తనను ఎందుకు పెళ్లి చేసుకున్నానా? అని కుమిలి పోయి ఆత్మహత్యకు పాల్పడేదంటూ ఒకరకంగా ప్రత్యర్థులను హెచ్చరించే విధంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. అలాగే తనకు ఏ పాపం తెలియదని, తనను కన్న తల్లిదండ్రులు మీద ఒట్టేసి మరీ చెబుతున్నానని, తనకు బియ్యం పాపంలో పాత్ర లేదని తెలిపారు.
గతంలో ఎన్నడూ...
నిజానికి పేర్ని నాని గత ఐదున్నరేళ్ల కాలంలోనూ, అంతకు ముందు కానీ ఇంత బేలతనాన్ని చూడలేదు. రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. మచిలీపట్నంలోని తన ప్రత్యర్థిని హత్య కేసులో ఇరికించి జైలుకు పంపినప్పుడు ఆ కుటుంబమూ ఇదే రకంగా బాధపడి ఉంటుంది కదా నానీ? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మరోవైపు తన నోటి నుంచి ఎప్పుడూ రాని విధంగా చంద్రబాబుపై పొగడ్తలను కురిపించారు. మంత్రి ఒకరు పేర్ని నాని భార్యను అరెస్ట్ చేయాలని చంద్రబాబు వద్దకు వెళితే ఆయన వారించారని, అవసరమైతే నానిని, వాళ్ల కుమారుడిని అరెస్ట్ చేయించమని చెప్పారంటూ, చంద్రబాబు మహిళల పట్ల విజ్ఞత ప్రదర్శించారంటూ ప్రశంసించారు. దీంతో పేర్నినానిలో ఈ మార్పేంటి అంటూ సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




Tags:    

Similar News