Free Gas Cylender : నేటి నుంచే ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభం కానుంది

Update: 2024-11-01 04:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభం కానుంది. దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన నేడు కార్యరూపం దాల్చనుంది. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా నేటి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయనున్నారు. ఏడాదికి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా...
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతుల మీదుగా లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను అందచేయనున్నారు. వాస్తవానికి దీపావళి రోజు నుంచే ఉచిత గ్యాస్ పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ గ్యాస్ కంపెనీల అభ్యర్థనల మేరకు ఒకరోజు వాయిదా వేయాల్సి వచ్చింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీ కంపెనీ ఖాతాల్లో నగదు జమ చేసింది. మొదటి విడత నిధులు 865 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం వాటిని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.
వచ్చే పంపిణీ నుంచి...
అయితే ఈ నెల తొలుత వినియోగదారులు ముందుగా గ్యాస్ కంపెనీలకు డబ్బులు చెల్లిస్తే వెంటనే ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో గ్యాస్ సిలిండర్ సొమ్మును జమ చేస్తుంది. ఇక వచ్చే గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయానికి ఈ విధానాన్ని మార్చి ముందుగానే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 కోట్ల మంది లబ్దిదారులు ఈ పథకం కింద లబ్ది పొందనున్నారు. ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈరోజు ప్రారంభించనుండటంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ లో నిజంగా అసలైన దీపావళి పండగ అంటూ మహిళలు నినదిస్తున్నారు.



Tags:    

Similar News