Weather Report : ఏపీ, తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన ఎక్కడెక్కడంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీచేసింది. రెండు తెలుగు రాష్ఠ్రాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోనూ అనేక చోట్ల భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ఇంకొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశముందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల మేరకు వీచే అవకాశముందని తెలిపింది.
ఏపీలో నేడు ఇక్కడ...
ఆంధ్రప్రదేశ్ లో నేడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కడప, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశముందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో నేడు ఇక్కడ...
ఇక తెలంగాణలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు బలంగా వీస్తాయని పేర్కొంది. ఈ వర్షాలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొంది. ఈరోజు కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కొమురంభీం, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రైతులు తీవ్రంగా ఈ అకాల వర్షానికి నష్టపోయారు. మరో రెండు రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో ముఖ్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు.