Ys Sharmila : చెల్లీ కొంచెం ఎక్కువయినట్లుందిగా... ఇక ఆపితే బాగుంటుందేమో?

వైెఎస్ ఆస్తుల వివాదంలో వైఎస్ షర్మిల ప్రతి రోజూ మీడియా ముందుకు రావడం విమర్శలు చేయడం, విసుగు తెప్పిస్తుంది

Update: 2024-10-31 06:55 GMT

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దలు. ఏదైనా ఒక లైన్ వరకే వినడానికి బాగుంటుంది. ప్రతి రోజూ అదే పనిగా ఏ పని చేసినా అది కొంచెం అతిగానే అనిపిస్తుంది. వినడానికి వెగటు పుట్టించేలా ఉంటుంది. ఉన్న కాస్తో కూస్తో ఉన్న సానుభూతి కూడా అతి చేస్తుంటే అది తుడిచిపెట్టుకు పోతుంది. అది ఏ పని అయినా కావచ్చు. కొంతవరకే వినసొంపుగా ఉంటుంది. తర్వాత విసుగు పుడుతుంది. ఇప్పుడు వైెఎస్ ఆస్తుల వివాదంలోనూ వైఎస్ షర్మిల ప్రతి రోజూ మీడియా ముందుకు రావడం విమర్శలు చేయడం, లేకుంటే లేఖలు రాస్తూ తనకు అన్యాయం జరిగిందని చెబుతుండటం కొంత విసుగు తెప్పించేలా కనిపిస్తుంది.

ఎన్నో సమస్యలున్నా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా చెల్లెళ్ల ఆస్తుల గొడవే కాదు.. ఎన్నో సమస్యలు పేరుకు పోయి ఉన్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవైపు విద్యుత్తు ఛార్జీల పెంపుదల మరొక వైపు పోలవరం పూర్తికాకపోవడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులు జరగకపోవడం, సంక్షేమ పథకాలు అందకపోవడం ఇలా ఎన్నో సమస్యలున్నాయి. నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. నూనె ధరలు మండిపోతున్నారు. కూరగాయలు కొనలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇక వీళ్లిద్దరి సమస్య ఒక్కటేనన్నట్లు ప్రతిరోజూ మీడియాలో ఇదే విషయం నాన్చుతుండటం విసుగు తెప్పిస్తుంది.మీ ఆస్తుల గొడవ మాకెందుకు తల్లీ అన్నట్లు పరిస్థితి తయారయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలుకు ఇది ఒక్కటే సమస్య అయినట్లు మరొక సమస్య ఏదీ లేదన్నట్లు మాకు ఏందీ గొడవ తల్లీ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి.
ఆస్తుల గొడవ ...
వైఎస్ కుటుంబం ఆస్తుల గొడవ వారి కుటుంబానికే పరిమితం కావాలి. అది సమాజం సమస్య అయి కూర్చునేటట్లు చేయడం సరికాదు. ఏదైనా ఇంట్లో సమస్యలుంటే పెద్దల ద్వారానో, న్యాయస్థానాల ద్వారానో సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి. లేకుంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలి. అంతే తప్ప ప్రజల్లో ప్రతి రోజూ ఇదే విషయాన్ని చెబుతూ, పదే పదే అదే విషయాలను ప్రస్తావిస్తుంటే ప్రజల నుంచి కూడా మద్దతు లభించదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వైెఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రధానపార్టీకి అధినేత. అలాగే వైఎస్ షర్మిల కూడా జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఏపీ శాఖకు చీఫ్ గా ఉన్నారు. ఆమె నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి.
పార్టీని బలోపేతం చేయకుండా...
ఆమె ముందుగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. అలాగే ప్రజా సమస్యలపై పోరాడాలి. పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క ప్రజా పోరాటం చేసిన పాపాన పోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయకుండా ప్రజల్లోకి ఎలా వెళతారని సొంత పార్టీ నేతలే ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా ప్రజా పోరాటం చేయడం ద్వారానే రాజకీయంగా ఎదగాలన్న విషయం మరచిపోయి వ్యవహరిస్తే అసలు ఏపీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూడను కూడా చూడరు. కొద్ది రోజుల పాటు మీ వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై ఫోకస్ పెడితే ఇటు పార్టీకి బాగుంటుంది. అటు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.







Tags:    

Similar News