Tirumala : వామ్మో తిరుమలలో ఒక్కసారిగా ఇంత రద్దీనా? దర్శనం కష్టమేనా?

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో పాటు దీపావళి పండగకు వరస సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.;

Update: 2024-11-01 03:31 GMT

trirumala darshan today

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో పాటు దీపావళి పండగకు వరస సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా తక్కువగా ఉన్న రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీధులన్నీ ఎక్కడ చూసినా భక్తులే. అన్నదాన సత్రం వద్ద కూడా ఉదయం నుంచి భక్తుల రాక ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. లడ్డూ పంపిణీ కేంద్రాల వద్ద కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. లడ్డూలను తీసుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇక వసతి గృహాల సంగతి చెప్పనవసరం లేదు. వసతి గృహాల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఖాళీ చేస్తేనే వెంటనే వాటిని భక్తులకు వరసగా కేటాయిస్తున్నారు. దీంతో వసతి గృహాల వద్ద కూడా లైన్ పెద్దగా దర్శనమిస్తున్నాయి. దీంతో తిరుమల భక్తులతో కళకళలాడిపోతుంది. గత వారం పది రోజుల నుంచి బోసి పోయిన తిరుమల ఈరోజు మాత్రం భక్తులతో దర్శనమిస్తుంది.

కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి...
ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారాలు వరసగా రావడంతో నిన్నటి నుంచే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. భక్తులు తాకిడి ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట టీబీసీ వరకూ విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,987 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,902 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News