బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది దక్షిణ కోస్తా వైపు ప్రయాణించి తమిళనాడు తీరానాకి చేరుకునే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రానున్న కొద్ది గంటల్లో మరింత బలపడి ఉత్తరదిశగా ఆంధ్రతీరం వైపు పయనించే అవకాశముందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం...
ఈ అల్పపీడనం ప్రభావంతో నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశముంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతుండటంతో అక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మబ్బులు ఆవరించి ఉన్నాయి. మత్స్యకారులను కూడా ఆదివారం వరకూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచిస్తున్నారు. వాగులు, వంకలు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు...
ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే వర్షాలు కురియడంతో అనేక మంది దళారులు వచ్చి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి వెళుతున్నారు. తక్కువ ధరకైనా రైతులు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయరని భావించి దళారులకు స్వల్ప మొత్తానికి విక్రయిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో తీర ప్రాంతం వెంట గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సమయంలో అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now