కొండమీద రోజా అనుచరులతో హంగామా
తిరుమలలో మంత్రుల హంగామా ఎక్కువయింది. తమ అనుచరులను ఎక్కువమందిని తిరుమలకు తీసుకు వచ్చి దర్శనాలకు పట్టుబడుతున్నారు.
తిరుమలలో మంత్రుల హంగామా ఎక్కువయింది. తమ అనుచరులను ఎక్కువమందిని తిరుమలకు తీసుకు వచ్చి దర్శనాలకు పట్టుబడుతున్నారు. మంత్రులే టీటీడీపై అధికారులపై వత్తిడి తెస్తున్నారు. తాజాగా మంత్రి ఆర్కే రోజా 30 మంది అనుచరులతో ప్రొటోకాల్ బ్రేక్ దర్శనం కోసం పట్టుబట్టారు. అయితే టీటీడీ అధికారులు అందుకు అంగీకరించలేదు. మంత్రి రోజాతోపాటు కేవలం పది మందికే ప్రొటోకాల్ దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. మిగిలిన 20 మందికి సాధారణ బ్రేక్ దర్శనాలకే అనుమతించారు. దీంతో రోజా టీటీడీపై అసహనం వ్యక్తం చేశారు. వారి నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉంటుందని, తమ నియోజకవర్గ ప్రజల కోసం రెండు గంటల పాటు తాను ఆలయంలోనే ఉండాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు రోజా.
మంత్రుల తాకిడితో...
ఇటీవల తిరుమలకు మంత్రుల తాకిడి ఎక్కువయింది. తమ అనుచరులతో వచ్చి హంగామా చేస్తున్నారు. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు యాభై మంది అనుచరులకు దర్శనం చేయించుకుని వచ్చి వెళ్లారు. నిన్న గాక మొన్న మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా యాభై మంది అనుచరులతో వచ్చి దర్శనం కోసం టీటీడీ అధికారులపై వత్తిడి తెచ్చారు. తాజాగా రోజా కూడా నగరి నియోజకవర్గంలోని తన అనుచరుల కోసం తిరుమల వచ్చి హంగామా చేశారు. దీనివల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రోజుల తరబడి క్యూలైన్లలో వారు వేచి ఉండాల్సి వస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.