తిక్క కాదట..లెక్కేనట...
పవన్ కల్యాణ్ ఈరోజే కాదు ఎప్పటి నుంచో ఒకే లెక్కతో ఉన్నారు. నియోజకవర్గాల్లోనూ, బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసినా ప్రయోజనం లేదని భావిస్తున్నారు. అలా అన్ని హంగులున్న పార్టీలు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతాయని ఆయన లెక్క. అందుకే పార్టీని బలోపేతం చేయడం కంటే.. పార్టీని జనంలోకి తీసుకెళ్లడమే ప్రధాన ధ్యేయమని పవన్ కల్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నట్లుంది. అందుకే 2014లో ఆయన పార్టీ పెట్టినా ఎక్కడా పెద్దగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయలేదు. కేవలం కొన్ని జిల్లాల్లో తనకు నమ్మకమైన వారికి మాత్రమే జిల్లా బాధ్యతల పగ్గాలను అప్పగించారు. నేతల వల్ల ఓట్లు రావని, పార్టీ మీద నమ్మకముంటే జనం వెంట నిలబడతారని పవన్ కల్యాణ్ బలంగా నమ్ముతున్నారు.
పదేళ్ల నుంచి పార్టీని...
2014లో పార్టీ పెట్టినా, 2019 ఎన్నికల్లో మాత్రమే ఆయన సింబల్ తో బరిలోకి దిగారు. అయితే అన్ని స్థానాల్లో పోటీ చేసినా కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. అంటే నమ్మకం లేకనే ప్రజలు తమకు అండగా నిలబడలేదని నమ్ముతున్నారు. అదే 2024లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వంద శాతం స్ట్రయిక్ రేట్ తో అన్ని చోట్ల గెలిచారు. రెండు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఎంపిక చేసిన నేతలకే టిక్కెట్లు ఇచ్చారు. ఆచితూచి వ్యవహరించడంతో ఈ ఎన్నికల్లో వారు గెలిచారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. క్యాడర్ గ్రామ గ్రామాన ఉన్నా, వాడవాడలా నేతలున్నా పార్టీకి ఇబ్బందులే తప్ప ప్రయోజనం ఉండదన్న పవన్ లెక్కలు కరెక్టేనని అనిపిస్తున్నాయి.
కొన్ని జిల్లాలకే పరమితమైనా...
ఇప్పటికీ కొన్ని జిల్లాల్లోనే జనసేన ఉంది. పాత విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనే ఎమ్మెల్యేలందరూ విజయం సాధించారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాత్రం జనసేన గెలిచింది. మిగిలిన జిల్లాల్లో జనసేనపార్టీ అభ్యర్థులను పోటీ పెట్టలేదు. గెలవలేదు. అక్కడ పార్టీ ఉన్నా లేనట్లే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసులురెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్యలను చేర్చుకున్న పవన్ కల్యాణ్ తర్వాత పెద్దగా చేరికలపై కూడా శ్రద్ధపెట్టలేదు. అందుకు కారణం తన లెక్క కరెక్టే అయితే వచ్చే ఎన్నికల నాటికి నేతలు వారంతట వారే వస్తారని, టిక్కెట్లు ఇచ్చిన వారంతా గెలవాలన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనపడుతుంది. అనేక జిల్లాల్లో సరైన నాయకత్వం లేకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అన్ని జిల్లాలకు తానే నాయకుడనన్నభావనలో ఆయన ఉన్నట్లే కనపడుతుంది.