బెజవాడలో విరిగిపడిన కొండచరియలు..

ఏపీలో ఉత్తరరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా..

Update: 2023-07-26 03:05 GMT

రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. కొండప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఉత్తరరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి.

లబ్బీపేటలోని కస్తూరిబాయి పేట ప్రాంతంలో కొండచరియలు విరిగి ఇళ్లపై పడటంతో.. నాలుగు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, రక్షణ చర్యలు లేక అవస్థలు పడుతున్నామని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు భారీ వర్షాలకు పలు కాలనీలు నీటమునిగాయి. వర్షపునీరు డ్రైనేజీల ద్వారా వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


Similar News