Nadendla Manohar : నాదెండ్ల ఫుల్లు ఫైర్ లో ఉన్నారు... మినిస్టర్ పవర్ ఏంటో చూపిస్తున్నారుగా?

మంత్రి నాదెండ్ల మనోహర్ కేవలం సమీక్షలతో సరిపెట్టలేదు. ఆయన ఫీల్డ్ లెవెల్ కు వెళ్లి మరీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు

Update: 2024-07-01 05:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం ఏర్పాటయి పక్షం రోజులు కూడా కాలేదు. అయితే మంత్రులు అందరితో పోలిస్తే నాదెండ్ల మనోహర్ తన స్పెషాలిటీ చూపిస్తున్నారు. తనకున్న అనుభవాన్ని ఆయన ఉపయోగించి మరీ ఆయన తనకు కేటాయించిన శాఖలో ప్రక్షాళన చేపడుతున్నారు. అవినీతి ఎక్కువగా కనిపించే శాఖల్లో ఒకటి పౌర సరఫరాల శాఖ ఒకటి. ఈ శాఖ ద్వారా పేదలకు సక్రమంగా సేవలందిస్తే ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి మంచి పేరు వస్తుంది. పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాదెండ్ల మనోహర్ తొలి రోజే ఆ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు.

సమీక్షలతో సరిపెట్టకుండా...
కేవలం సమీక్షలతో సరిపెట్టలేదు. ఆయన ఫీల్డ్ లెవెల్ కు వెళ్లి మరీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పౌరసరఫరాల గోదాముకు వెళ్లి ప్రజలకు అందించే బియ్యం, పంచదార, నూనె వంటి వస్తువుల్లో నాణ్యతను పరిశీలించారు. నూనె, పంచదార తక్కువ తూకంతో ఉన్నట్లు కనుగొన్న నాదెండ్ల మనోహర్ అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ పాస్ చేశారు. తూకం సక్రమంగా లేకపోతే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ లు పంపారు. తూకం తక్కువయితే అందుకు ఉన్నతాధికారులనే బాధ్యులను చేస్తానని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖను గాడిన పెట్టాలంటే ముందు ఉన్నతాధికారులను కంట్రోల్ లో పెట్టాలని ఆయన తీసుకుంటున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తున్నాయి.
పోర్టు నుంచి రేషన్ నరుకులు...
ఇక అంతటితో ఆగలేదు. కాకినాడ వెళ్లారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం దారి మళ్లుతుందని గత ఎన్నికల సందర్భంగా జనసేన, టీడీపీ అగ్రనేతలు ఆరోపించారు. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు నాదెండ్ల రెండు రోజుల పాటు కాకినాడలోనే మకాం వేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ఊరుకోలేదు. కాకినాడలో రేషన్ మాఫియా ఆటకట్టించేందుకు గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ సరుకులు ఇతర దేశాలకు మళ్లుతున్నాయని ఆయన తనిఖీల తర్వాత ఆరోపించారు. కాకినాడ పట్టణ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబీకుల హస్తం ఉందని ఎన్నికల సమయంలోనూ పవన్ కల్యాణ్ ఆరోపించారు. దీంతో కాకినాడపై నాదెండ్ల స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మాఫియాపై ఉక్కుపాదం ....
కాకినాడలో తొలిరోజు ఆరు గోదాముల్లో లోపాలున్నట్లు గుర్తించామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కాకినాడలో వ్యవస్థీకృతమైన మాఫియా ఉందని, రేషన్ మాఫియా అక్రమాలపై సీబీఐ విచారణను తాము కోరనున్నట్లు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సొంత నౌకను ఏర్పాటు చేసుకుని కాకినాడ పోర్టు నుంచి ఎవరు రేషన్ సరుకులను తరలిస్తున్నారో వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ ఫీల్డ్ లెవెల్ విజిట్స్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. జనసేన పార్టీకి చెందిన మంత్రిగా ఆయన తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నాదెండ్ల పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలిసింది.


Tags:    

Similar News