Tirumala : తిరుమలలో స్వామి వారిని నేడు దర్శించుకోవాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో లక్షలాది మంది భక్తులు కొండకు చేరుకుంటున్నారు

Update: 2024-10-06 03:11 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో లక్షలాది మంది భక్తులు కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల కొండలు భక్త జనసంద్రంతో ఉన్నాయి. ఎటు చూసినా జనమే. ఎక్కడైనా చోటు దొరకడం కష్టమే. చిన్న స్థలం దొరకితే చాలు అదే భాగ్యమన్న రీతిలో భక్తులు ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడ వీధుల్లో ఉదయం, సాయంత్రం వేళ స్వామి వార్లు దర్శనమిస్తుండటంతో భక్తులు ఎక్కువ మంది ముందుగానే మాడ వీధులకు చేరుకుని అక్కడే కూర్చుని స్వామి వారిని దగ్గరగా వీక్షించేందుకు పరితపించిపోతున్నారు. ఇక అన్నదాన సత్రం వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయివేటు హోటల్స్ వద్ద కూడా భక్తులు అధికసంఖ్యలో చేరుకుని అల్పాహారాన్ని తీసుకుంటున్నారు. మంచినీటి నుంచి అన్నప్రసాదాల వరకూ క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంటుంది.

వసతి గృహాలు సయితం...
బ్రహ్మోత్సవాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలని ప్రతి బాలాజీ భక్తుడు పరితపించి పోతుంటారు. అందుకే బ్రహ్మోత్సవాలకు ఎక్కువ రద్దీ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో బయట క్యూ లైన్ బాట గంగమ్మ దేవాలయం వరకూ విస్తరించి ఉంది. అతి పెద్ద లైన్ కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లు చెప్పకనే తెలుస్తుంది. ఇక ఉచిత దర్శనానికి ఈరోజు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయినా వేగంగానే దర్శనం చేసి భక్తులను టీటీడీ సిబ్బంది పంపించి వేస్తున్నారు. ఇక వసతి గృహాలు దొరకడం దుర్లభంగా మారింది. కొన్ని గంటల పాటు వెయిట్ చేస్తేనే వసతి గృహం దొరికే పరిస్థితి ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,552 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,885 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే నిన్న హుండీ ఆదాయం మాత్రం చాలా తక్కువగా వచ్చింది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.54 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News