Tirumala : సోమవారమయినా ... తగ్గని భక్తుల రద్దీ...దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో ఇదే పరిస్థితి నెలకొంది. తిరుమలలో ఒక్కసారిగా భక్తులు రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వసతి గృహాలను తక్షణమే భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న ఎక్కువమంది రావడంతో పాటు తమిళనాడులో పెళ్లిళ్లు జరుగుతుండటంతో ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటున్నారని అధికారులు తెలిపారు. భక్తులకు శ్రీవారి దర్శనం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోల చేసిన భక్తులకు శ్రీవారిదర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న తిరుమ శ్రీవారిని 75,963 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 26,956 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.99 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.