Tirumala : తిరుమలలో నేటి భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు;
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. కృష్ణాష్ణమి కావడంతో సెలవు దినం అయిన సోమవారం కూడా భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని సందర్శించుకుంటున్నారు. శుక్ర వారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తిరుమల హుండీ ఆదాయం కూడా పెరుగుతుంది. భక్తులు ఈనెలలో అధిక సంఖ్యలో తిరుమలను దర్శించకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రావణమాసం కావడంతో పాటు ఈ నెలలో ఎక్కువ సెలవులు రావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు తెలిపారు. వసతి గృహాలు లేక చాలా మంది భక్తులు అవస్థలు పడుతున్నారు. అయినా స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తూనే ఉన్నారు.
అన్ని కంపార్ట్‌మెంట్లు...
భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ సామర్థ్యానికి మించి భక్తులు వస్తుండటంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట టీబీసీ వరకూ భక్తుల క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి గంటల సమయం పడుతుంది. అందుకే క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు మంచినీరు, అన్న ప్రసాదాలను అందచేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని ఉచిత దర్శనం క్యూలైన్ లోకి ఉదయం ఏడు గంటలకు ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 84,060 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.01 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.