ప్లాన్ ప్రకారమే ఇద్దరి డ్రామాలు
ప్లాన్ ప్రకారం వాతావరణం సృష్టించి కలవాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
ఒక ప్లాన్ ప్రకారం వాతావరణం సృష్టించి కలవాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక వాతావరణాన్ని వారంతట వారే క్రియేట్ చేసుకుంటున్నారన్నారు. విశాఖ గర్జన రోజునే పవన్ అక్కడకు వచ్చి మరుసటి రోజు విజయవాడ చేరుకున్న పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పరామర్శించడం ఇందులో భాగమేనని అన్నారు. ఇప్పటంలో ముందు పవన్ పర్యటించిన తర్వాత లోకేష్ వచ్చి టూర్ చేసి వెళ్లడం కూడా అంతేనని అన్నారు.
గొడ కూడా కూల్చలేదు...
ఇప్పటంలో జనసేన ప్రాంగణానికి భూమి ఇచ్చిన వారి ఒక్కరి గోడ మాత్రమే కూలిందని, ఆయన స్టే తెచ్చుకున్నారన్నారు. ఇక ఇప్పటం తర్వాత నందిగామలో గులకరాయి డ్రామా కూడా అంతేనని అన్నారు. లేని దాని నుంచి ఏదో తయారు చేసి కలవాలనుకుంటున్నారన్నారు. వారు రాజకీయంగా కలిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే వైసీపీ పై నిందలు మోపి కలవడం ఎందుకని సజ్జల ప్రశ్నించారు. లేని ఇష్యూను క్రియేట్ చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆక్రమణలను తొలగించాలా? వద్దా? అని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రజలు ఇది గమనిస్తున్నారని ఆయన అన్నారు.
బాబు వర్గం మీడియా...
వైసీపీ తన మ్యానిఫేస్టోలో 98 శాతం పూర్తి చేశామని, కానీ చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం రెండు శాతం మీదనే కథనాలను రాస్తున్నాయని సజ్జల మండి పడ్డారు. ప్రభుత్వాన్ని పలచన చేయడానికే ఆ మీడియా ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వం పనిచేయడం లేదన్న కలర్ ఇచ్చేందుకు ఆ మీడియా రోజూ చేస్తుందని సజ్జల అన్నారు. చంద్రబాబు పాలనలో మాత్రం తప్పులు ఈ మీడియాకు కనపడలేదన్నారు. 31 లక్షల ఇంటి స్థలాలను పేదలకు ప్రభుత్వం ఇస్తే, దానిలో నిర్మాణం జరగలేదని ఆడిట్ నిర్వహిస్తున్నారని సజ్జల ఎద్దేవా చేశారు.