Chandrababu Naidu : నాయుడు గారూ మళ్లీ రిపీట్ చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టులైన అమరావతి, పోలవరం మూడేళ్లలో పూర్తవుతాయా? అన్న సందేహం కలుగుతుంది
చూస్తుంటే మళ్లీ 2014 తరహాలో రిపీట్ అయ్యేటట్లే కనిపిస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో అయ్యేటట్లు కనిపించడం లేదు. అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఇది ఎంత వరకూ సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. తన ప్రాధాన్యతలు ఏమిటో ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే చెప్పారు. 1. అమరావతి 2. పోలవరం నిర్మాణం పూర్తి చేయడమని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణపనులు ఇంకా ప్రారంభం కాలేదు.టెండర్లను త్వరలో ఖరారు చేస్తామంటున్నారు.
అమరావతి పనులను…
టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించే సమయానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సమయం గడిచిపోతూనే ఉంది. మరోవైపు 2027లో జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే 2027 నాటికి అమరావతి నిర్మాణ పనులు పూర్లి అయ్యే అవకాశాలపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్ల వరకూ అయితే పూర్తి అయ్యే అవకాశముంది. అదే సమయంలో నూతన సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇందుకు అనేక కారణాలున్నాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
మూడేళ్లలో పూర్తి చేస్తామన్నా…
ఇక పోలవరం ప్రాజెక్టు కూడా అంతే. 2027 నాటికి పూర్తిచేస్తామని చెబుతున్న చంద్రబాబు ఎదుట ఎన్నో సవాళ్లున్నాయని చెప్పక తప్పదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. వారికి పునరావాసం కల్పించాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెంట వెంటనే సాయం అందాలి. అందులో గోదావరి నదికి వరద పోటు ఎప్పుడూ ఎక్కువగా ఉంటూనే ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న మేరకు జరిగే అవకాశం మాత్రం లేదు నీరు పుష్కలంగా ఉన్నప్పుడు పనులు జరిగే అవకాశం లేదు. నిధుల సమస్య కూడా వెంటాడుతూనే ఉంది. జాతీయ ప్రాజెక్టు కావడంతో పోలవరాానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. రాను రాను కేంద్రం వడివడిగా నిధులను విడుదల చేస్తుందా? అన్న సందేహం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది.
ప్రకృతి సహకరించాలిగా…
దీంతో పాటు మరొక ప్రధాన సమస్య ఆంధ్రప్రదేశ్ కు అల్పపీడనాలు.. వాయుగుండాలు.. తుపానులు..గత కొద్దిరోజులుగా చూసుకుంటే ఏపీలో వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉన్నాయి. వర్షాకాలంలో ఇటు అమరావతి, అటు పోలవరం ప్రాజెక్టు పనులు జరిగే అవకాశం లేదు. భారీ వర్షాలు కురిసినప్పుడు నిర్మాణ పనులు ఆటోమేటిక్ గా నిలిచిపోతాయి. చంద్రబాబు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం లేదు. అనుకున్న సమయాానికి పనులు పూర్తి కావాలంటే ఇటు కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంది. అటు ప్రకృతి కూడా మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. ఇన్ని జరిగితేనే చంద్రబాబు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్టులు రెండూ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆ రెండింటిలో ఏ ఒక్కటి సహకరించకపోయినా సరే.. వచ్చే ఎన్నికల తర్వాత మాత్రమే ఈ రెండు నిర్మాణ పనులు పూర్తవుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు మాత్రం కిందా మీదా పడి అమరాతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఉన్నప్పటికీ అందుకు సహకారం ఏ మేరకు లభిస్తుందన్నది వేచిచూడాల్సిందే.