సత్య సాయి జిల్లాలో తమ్ముళ్ల రచ్చ
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఏ మేరకు అవినీతి చేశారో ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులే చెబుతూ ఉన్నారు
పుట్టపర్తి సత్య సాయి జిల్లాలో ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ల మధ్య సయోధ్య కనిపించకపోవడంతో తెలుగుదేశం అధిష్టానంలో ఓ కొత్త టెన్షన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో కూడా తెలుగు దేశం నాయకుల మధ్య మంచి రిలేషన్షిప్స్ లేకపోవడం బాధాకరమైన విషయం. అంతేకాకుండా తెలుగు తమ్ముళ్ల మధ్య కూడా ఎన్నో తగాదాలు.. ఒక్కో ఏరియాలో ఒక్కో గ్రూపు తమదైన రాజకీయం చేస్తూ వెళుతోంది. గత టీడీపీ హయాంలో ఒక్కో గ్రూపు నాయకుడు ఒక్కో ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసారు.. అందుకు తగ్గట్టుగా అప్పట్లో రాజకీయాలను నడిపోయారు. ఇక వైసీపీ విజయంతో కొద్ది రోజుల పాటూ సైలెంట్ గా ఉన్నారు. ఇక ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉండడంతో ఒక్కొక్కరిగా యాక్టివేట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడే అసలు సమస్యలు మొదలయ్యాయి. ఇన్చార్జీలపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించుకుంటూ ఒకరిని మరొకరు చులకన చేసుకుంటూ ఉన్నారు. పరస్పర అవినీతి ఆరోపణలతో రోడ్డున పడుతూ ఉండడంతో కార్యకర్తల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది.