Tirumala : నేడు తిరుమలలో గరుడ వాహన సేవ... రష్ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల అధిక సంఖ్యలో ఉన్నారు.మంగళవారమయినా గరుడ వాహన సేవ కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు

Update: 2024-10-08 02:31 GMT

 Tirumala darshan 

తిరుమలలో భక్తుల అధిక సంఖ్యలో ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉంది. మంగళవారమయినా గరుడ వాహన సేవ కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలలో గరుడ సేవను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు ఈరోజు తిరుమలకు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గరుడ వాహన సేవను చూస్తే జన్మ ధన్మమయినట్లు భక్తులు భావిస్తారు. అందుకే ఎక్కువ మంది తిరుమలకు వస్తుంటారు. అందుకే తిరుమలలో అన్ని వీధులూ భక్తులతో కిక్కరిసి పోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా జన సందోహమే. ఈరోజు దర్శనం చేసుకుని శ్రీవారి వాహన సేవను చూస్తే మంచిదని భావించి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. నిన్నటి నుంచే ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారు. కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

పద్దెనిమిది గంటలు...
ఈరోజు మూడున్నర లక్షల మంది గరుడ సేవను చూసేందుకు తరలి వచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా మంచినీరు, అన్న ప్రసాదాలను సిద్ధం చేశారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వకుళమాత రెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. బ్రేక్‌తో పాటు వీఐపీ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేయడంతో దర్శనం చేసుకోవాలంటే కష్టంగానే ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,481 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 38,762 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మాడ వీధుల్లో గరుడ వాహన సేవను తిలకించేందుకు ఇప్పటి నుంచే తమ స్థానాలను రిజర్వ్ చేసుకుంటున్నారు.
Tags:    

Similar News