Mudragada : ముద్రగడ ప్రయత్నాలు ఫలిస్తాయా?

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ గ్రాఫ్ క్రమంగా పడిపోయినట్లే కనిపిస్తుంది

Update: 2024-11-22 07:03 GMT

ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లును చవి చూశారు. ఎత్తుపల్లాలను అధిగమించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఆయన రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజల మన్ననలను పొందగలిగారు. అయితే గత ఎన్నికల సమయం నుంచి ఆయన ఇమేజ్ డౌన్ అవుతూ వచ్చింది. ఆయనను సొంత సామాజికవర్గం నమ్మలేదు. ఆయన మాటలను విశ్వసించలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో వైరమే ఆయనను కాపులకు దూరం చేసిందని చెప్పాలి.

పవన్ ను వ్యతిరేకించి…

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఆయన పనిచేయడమే కాకుండా కాపు రిజర్వేషన్లు తాను అమలు చేయనని చెప్పిన జగన్ పార్టీ పంచన చేరడం కూడా ముద్రగడకు మైనస్ గా మారింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ మంచి మెజారిటీతో గెలుపొందారు. చివరకు ముద్రగడ కుటుంబంలోని సభ్యులు కూడా ఆయనను వ్యతిరేకించారు. ఆయన కుమార్తె జనసేనలో చేరిపోయారు. ఇది ముద్రగడ రాజకీయ జీవితంలో కోలుకోలేని దెబ్బేనని చెప్పాలి. ముద్రగడ పద్మనాభంపై ఒక బలమైన ముద్రపడిపోయింది.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే…చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన కాపు రిజర్వేషన్లంటూ ఉద్యమిస్తారని, తర్వాత కాడి పడేస్తారన్న విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. దీనికి తోడు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పిన పద్మనాభం అఫిషియల్ గా పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఇది కాపు సామాజికవర్గంలో మరింత వ్యతిరేకత పెరగడానికి కారణమయిందని చెప్పాలి. ఆయన తొలుత జనసేనలో చేరాలని భావించినా పవన్ అందుకు అంగీకరించకపోవడంతో వైసీపీలో చివరి క్షణంలో చేరిపోయి మరింత చెడ్డపేరును మూటగట్టుకున్నారు.

ఇమేజ్ పొగొట్టుకుని…

ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోసారి లేఖలు రాయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకూ కాపు సామాజికవర్గం బలంతో రాజకీయంగా ఎదిగిన ముద్రగడ పద్మనాభం ఆ సామాజికవర్గం మద్దతు కోల్పోయారు. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఆయన మద్దతిచ్చిన వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఇది ఆయన గ్రాఫ్ పడిపోవడానికి ఉదాహరణగా చెప్పాలి. ఈ సమయంలో ముద్రగడ ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని స్టేట్ మెంట్లు ఇచ్చినా అది వృధాగానే మారతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఆయన రాజకీయంగా ఇక విశ్రాంతి తీసుకుంటేనే మేలు అన్న కామెంట్స్ ఆయన సన్నిహితుల నుంచే వినిపస్తున్నాయి. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ముద్రగడ తన ఇమేజ్ ను తానే పోగొట్టుకున్నట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News