భక్తులకు శుభవార్త.. నేటి నుంచి అందుబాటులోకి రానున్న శ్రీవారిమెట్టు మార్గం !
కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల.. భారీ వర్షాలకు జలపాతాన్ని, నదులను తలపించింది. ఆ వర్షాలకే శ్రీవారి మెట్టుమార్గం పూర్తిగా..
తిరుమల : గతేడాది నవంబర్ లో కురిసిన భీకర వర్షాలకు తిరుమల సహా తిరుపతి నగరమంతా అల్లకల్లోలమయింది. కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల.. భారీ వర్షాలకు జలపాతాన్ని, నదులను తలపించింది. ఆ వర్షాలకే శ్రీవారి మెట్టుమార్గం పూర్తిగా ధ్వంసమవ్వడంతో.. టిటిడి ఆ దారిని మూసివేసి, 5 నెలలుగా మరమ్మతు పనులు చేపట్టింది. శ్రీవారి మెట్టుమార్గానికి మరమ్మతులు పూర్తి కావడంతో.. మళ్లీ భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తోంది టిటిడి.
నేటి నుంచి శ్రీవారి మెట్టుమార్గం భక్తులకు అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 3.60 కోట్ల వ్యయంతో మరమ్మతు పనులు పూర్తి చేశారు. 800, 1200 మెట్ల వద్ద కూలిపోయిన వంతెనలను కూడా పటిష్టంగా నిర్మించారు. శ్రీవారి మెట్టు మార్గానికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అనుమతిస్తారు. ఎప్పట్నుంచో ఈమార్గం ద్వారా కొండపైకి వెళ్లాలనుకుంటున్న భక్తులంతా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.