Janasena, Tdp : నేటి నుంచి టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాటం
నేడు తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి ఆందోళనలకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ఉమ్మడి పోరాటానికి రెడీ అయ్యాయి
నేడు తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి ఆందోళనలకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ఉమ్మడి పోరాటానికి రెడీ అయ్యాయి. రెండు పార్టీలు అధికారికంగా పొత్తు ఖరారు చేసుకున్న తర్వాత ఉమ్మడి కార్యాచరణతో నేటి నుంచి పోరాటానికి దిగుతున్నాయి. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శని, ఆదివారాల్లో ఉమ్మడి ఆందోళనలకు దిగుతున్నాయి. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు చేసేందుకు ప్రణాళికను రూపొందించుకున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడి సమావేశాలను నిర్వహించిన జనసేన, టీడీపీలు నేటి నుంచి పోరాట బాట పట్టనున్నాయి.
రోడ్ల దుస్థితిపై...
ఉమ్మడి మ్యానిఫేస్టోను కూడా విడుదల చేయనున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గుంతలపై ఆందోళనకు దిగనున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహదారులను పట్టించుకోలేదని, గుంతలమయంగా మారి ప్రజలు అవస్థలు పడుతున్నారని టీడీపీ, జనసేన ఈ ఆందోళనలు చేయనుంది. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఆదేశాలు అందడంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల నేతలు నేడు రోడ్ల దుస్థితిపై ఆందోళన చేయాలని నిర్ణయించాయి. రేపు కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది.