YSRCP : పౌరుషం ఉన్న ఆ వైసీపీ రెడ్డి నేతలు ఎక్కడ? ఏమైపోయారు?
పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు నోళ్లు మూగవోయాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు
పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు నోళ్లు మూగవోయాయి. అధికారంలో ఉన్ననాళ్లు, లేని నాళ్లు పల్నాడు ప్రాంతం గట్టిగా వాయిస్ వినిపించే నేతలు నేరు కామ్ అయిపోయారు. మాచర్ల, నరసరావుపేట, గురజాల నేతలు అస్సలు ఎక్కడ? అంటూ వైసీపీ నేతలే విస్తుపోతున్నారు. గతంలో 2014లో అధికారం లేనప్పుడు కూడా ఇలాంటి పరిస్థిితి లేదు. కానీ ఈసారి మాత్రం అందరూ నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు. దీనిపై క్యాడర్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఒక్క అంబటి రాంబాబు మినహా మాత్రం ఎవరూ నోరు ఎత్తడం లేదు. కనీసం రోడ్డు మీదకు వచ్చి వైసీపీకి మద్దతుగా నిలబడటం లేదు.
పిన్నెల్లి మాచర్లకు దూరంగా...
మాచర్లలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఆయనపై కేసులు నమోదు కావడం, జైలు జీవితం గడిపి రావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గానికి కూడా పెద్దగా రావడం లేదు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉంటున్నట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థిగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి మంచి ఊపు మీదున్నారు. ఈ సమయంలో నియోజకవర్గంలోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకంటే మౌనమే మేలని పిన్నెల్లి భావిస్తున్నారట.
కాసు కామ్ గా...
ఇక మరో కీలక నియోజకవర్గం గురజాల.. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి గెలుపొందారు. నరసరావుపేట నుంచి వచ్చినా కాసు కుటుంబంపైన గౌరవంతో నాడు గెలిపించారు. నాడు జగన్ గాలి కూడా వీయడంతో గెలిచిన మహేష్ రెడ్డి ఐదేళ్ల పాటు ఒక వెలుగు వెలిగారు. యువనేతగా పల్నాడు ప్రాంతంలోని గురజాలలో పట్టు సాధించిన మహేష్ రెడ్డి వైఎస్ జగన్ కు కూడా సన్నిహితుడు కావడంతో నిధులు కూడా తెచ్చుకుని బాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారంటారు. కానీ ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి కాసు మహేష్ రెడ్డి ఎక్కడా కనిపించకుండా పోయారు. కనీసం వైసీపీ తరుపున మాట్లేందుకు కూడా ముందుకు రావడం లేదు. అప్పుడప్పుడు మీడియా ముందుకు అలా వచ్చి కనిపించి ఏదో నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతున్నారు.
గోపిరెడ్డి మౌనం ఎందుకో?
ఇక మరో రెడ్డి అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. ఈయన నరసరావుపేట నుంచి వరసగా రెండు సార్లు గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయి హ్యాట్రిక్ విక్టరీని మిస్ అయ్యారు. మూడుసార్లు ఆయనకు నరసరావుపేట టిక్కెట్ ఇచ్చిన జగన్ వెంట నిలవాల్సిన గోపిరెడ్డి కష‌్టకాలంలో మాత్రం కామ్ అయిపోయారు. పార్టీ జెండా పట్టుకున్న క్యాడర్ ను కాపాడేందుకు కూడా నేతలు ముందుకు రాకపోవడంతో పల్నాడు ప్రాంతంలో వైసీపీ కొంత ఇబ్బందులు పడుతుంది. వైఎస్ జగన్ సమీక్ష సమావేశాలకు కూడా వీరంతా హాజరు కావడం లేదు. నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉంటూ కాలం గడిపేస్తున్నారని పార్టీ క్యాడర్ ఆరోపిస్తుంది.