విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు కదలడం లేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి విజయవాడ గ్రామీణ మండలంలోని ఎనికేపాడు గ్రామం పరిధిలో 3 వేల 272.55 చదరపు గజాల భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వ చర్యలు చూస్తూ ఉంటే విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు ముందుకు కదలడం కష్టమేనని అంటున్నారు. గత ప్రభుత్వం 2017లో మెట్రో రైల్ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిలో భాగంగా ఎనికేపాడు పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలోని 3 వేల 272.55 చదరపు గజాల్ని తీసుకోవాలని నిర్ణయించింది. వాటిలో కొంత గ్రామకంఠం భూమితో పాటు, వివిధ వ్యక్తులకు చెందిన ఇళ్ల స్థలాలున్నాయి. ఆ భూ సేకరణ ప్రతిపాదన రద్దు చేస్తూ కలెక్టర్ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జారీ చేసిన భూసేకరణ ముసాయిదా నోటిఫికేషన్ గడువు 2019లోనే ముగిసిందని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మెట్రోరైల్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే అప్పుడు మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.