Ys Jagan : తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ రియాక్షన్
ఈ వందరోజుల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు పర్చలేదన్నారు.
ఈ వందరోజుల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు పర్చలేదన్నారు. జగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఏమీ చేయలేక చంద్రబాబు పచ్చి అబద్ధాలకు తెరలేపుతున్నారని తెలిపారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం ఇష్టంలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను నడుతున్నారని జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ దుర్గార్గంగా వ్యవహరించారన్నారు. ప్రజల ఆశలతో, జీవితాలతో ఆటలాడుకున్నారన్నారు. అన్ని వ్యవస్థలు తిరోగమనం పట్టాయన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఏమీ లేదన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన లేదన్నారు. తల్లికి వందనం ఇవ్వడంలేదన్నారు. గోరు ముద్ద గాలికి ఎగిరిపోయిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను స్కామ్ ల కోసం ప్రయివేటు పరం చేస్తున్నారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందలేదన్నారు.
వంద రోజుల పాలనలో...
వంద రోజుల పాలనలో ఏమీ చేయలేక చివరకు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగారన్నారు. ఎంత దారుణమైన పాలిటిక్స్ అంటే వందరోజుల పాలనపై ప్రజలు నిలదీస్తారని భావించి ఈ దుర్మార్గమైన ఆలోచన చేశారని జగన్ అన్నారు. ఇంత దుర్మార్గపు పనిని ఎవరైనా చేయగలుగుతారా? అని జగన్ ప్రశ్నించారు. తిరుమల స్వామి వారికి వచ్చే నెయ్యిలో కల్తీది వాడతారా? నెయ్యికి బదులు జంతువుల నూనెను వాడారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట్లాడవచ్చా? అబద్ధాలు ఆడటం ధర్మమేనా? అని జగన్ నిలదీశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? అని ప్రశ్నించారు. దాని ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది అందరూ ఆలోచన చేయాలన్నారు. ఇదేదో కొత్తగా నెయ్యిని కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్ లైన్ లో టెండర్లు పిలిచి, కంపెనీలకు టీటీడీ బోర్డు ఓకే చెబుతుందని జగన్ అన్నారు. కొత్తగా తాము వచ్చి నిబంధనలను మార్చలేదన్నారు.
ప్రక్రియ ఇలా...
తిరుమల లడ్డూ ఎంతటి ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలుసునని జగన్ అన్నారు. దశాబ్దాలుగా జరుగుతుందేనని అన్నారు. ఎవరూ దానిలో వేలు పెట్టరని జగన్ అన్నారు. ఎవరూ వచ్చి ఇందులో దూరి నాసిరకం నెయ్యిని సప్లయ్ చేయరని తెలిపారు. కంపెనీలు సప్లయ్ చేసిన ప్రతి ట్యాంకర్ తో పాటు నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ ల్యాబ్స్ అప్రూవ్ చేసిన తర్వాతనే టీటీడీకి చేరుతుందన్నారు. తిరుమలకు వచ్చిన తర్వాత కూడా మూడు శాంపిల్స్ తీసుకుని అవి పాస్ కావాలన్నారు. ఈ మూడు టెస్ట్‌లు పాస్ అయిన తర్వాతనే వాటిని ప్రసాదంలో వినియోగిస్తారని అన్నారు. లేకుంటే ట్యాంకర్ ను వెనక్కు పంపుతామని జగన్ వివరించారు. ఈ విధానాన్ని ఎవరు అధికారంలో ఉన్న వారు ఎవరైనా సరే అవలంబిస్తారని జగన్ అన్నారు. అలాంటప్పుడు దానిని వాడారని, జంతువుల నూనె అని చెప్పడం అబద్ధాలు కాదా? ఇది ధర్మమేనా? న్యాయమేనా? అని జగన్ ప్రశ్నించారు.