భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించండి... జనవరి నుంచే పింఛన్లు పెంపు

భరత్ ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని, మంత్రిగా పంపిస్తానని జగన్ ప్రజలను కోరారు

Update: 2022-09-23 08:20 GMT

ఈ జనవరి నుంచి పింఛను 2,750 రూపాయలు ఇస్తామని జగన్ తెలిపారు. ఎన్నికల మ్యానిఫేస్టో చెప్పినట్లు తాను నిలుపుకుంటున్నానని జగన్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రకటించారు. భరత్ ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని, మంత్రిగా పంపిస్తానని జగన్ ప్రజలను కోరారు. ఎమ్మెల్సీ ద్వారానే భరత్ తన చేత అనేక పనులను కుప్పం నియోజకవర్గానికి చేయించుకున్నారని తెలిపారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అందరి అక్క చెల్లెమ్మను ఆదుకుంటున్నామని తెలిపారు. 18,7500 రూపాయలు ఈ మూడో విడత అందిస్తున్నామని తెలిపారు. 45 నుంచి 60 సంవత్సరాల వయసులోపు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. కుటుంబాన్ని బాధ్యతతో మోయగలవారికి డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. కుప్పం అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిల అభివృద్ధి అని అన్నారు. 39 నెలల కాలంలో ఇప్పటి వరకూ చేయూత ద్వారా 14,110 కోట్ల రూపాయలను అక్కచెల్లెమ్మలకు అందించామని తెలిపారు.

క్రమం తప్పకుండా...
క్రమం తప్పకుండా ఒక్కొక్కరికి 56,650 రూపాయలు ఇచ్చామన్నారు. 39 నెలల్లో అమ్మఒడి కింద 19,600 కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా 12,758 కోట్లు, వైఎస్సార్ చేయూత 14,111 కోట్లు, ఆసరాలో ఉన్న కోటి మంది అక్క చెల్లెళ్లకు సున్నా వడ్డీ పథకానికి 3,415 కోట్లు ఇచ్చామన్నారు. నాలుగు పథకాల మహిళలకు ద్వారా 39 నెలల కాలంలో 51 వేల కోట్లు ఇచ్చామని జగన్ చెప్పారు. వివిధ పథకాల ద్వారా 1.71 లక్షల కోట్లను ఒక్క బటన్ నొక్కి పేదలకు పంపిణీ చేశామన్నారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపితే 3,12,764 కోట్ల రూపాయలను అర్హులైన కుటుంబాలకు ఇచ్చామని తెలిపారు. మహిళల జీవితాలలో మార్పు కనిపిస్తుందని జగన్ అన్నారు.
14 ఏళ్ల నుంచి...
గత ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ ఇప్పటి బడ్జెట్ ఒక్కటేనని, అయినా అప్పుడు జరగని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ఆలోచించుకోవాలని జగన్ ప్రశ్నించారు. 14 సంవత్సరాలుగా చంద్రబాబు ఈ కుప్పంనియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్, కుప్పంకు నాన్ లోకల్ అని అన్నారు. కుప్పం కరవుకు పరిష్కారం చూపలేకపోయారన్నారు. ట్రాక్టర్లు లేకుండా కుప్పానికి నీళ్లు 14ఏళ్లు చంద్రబాబు ఇవ్వలేకపోయారన్నారు. కనీసం కుప్పం మున్సిపాలిటీలో రోడ్డు కూడా వేయించలేకపోయారన్నారు. హంద్రీనీవాకు చంద్రబాబు అవరోధంగా మారాడని జగన్ ఆరోపించారు.
దొంగ ఓట్లకు కేరాఫ్ అడ్రస్....
కనీసం రెవెన్యూ డివిజన్ కూడా పెట్టలేకపోయారన్నారు. ప్రతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడలో అనుభవం ఆయనకుందన్నారు. వెన్నుపోటుకు, దొంగఓట్లకు ముప్ఫయిఏళ్లుగా కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని జగన్ అన్నారు. కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదని, ఓటు కూడా లేదని జగన్ మండి పడ్డారు. బీసీలకు అన్యాయం చేశారన్నారు. ఆయన సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. 1983 నుంచి ఇప్పటి దాకా ఒక్కసారైనా టీడీపీ ఈ సీటును బీసీలకు ఇవ్వలేదన్నారు. ఇది బాబు మార్క్ సామాజిక న్యాయమని అన్నారు. బీసీలను ఉపయోగించుకుని విడిచి పెడతున్నారని అన్నారు. మరో ఆరు నెలల్లో హంద్రీ నీవా బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేస్తామన్నారు. మున్సిపాలిటిగా కుప్పంను చేసి 66 కోట్లు పనులకు ఇచ్చింది ఈ ప్రభుత్వం అని తెలిపారు.


Tags:    

Similar News