గాయత్రీదేవి అలంకారంలో నేడు
శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు గాయత్రిదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తుంది
శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు గాయత్రిదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రి దేవిని పూజిస్తే సకల సౌభగ్యాలు కలుగుతాయని, ఉపద్రవాలు తొలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. ఈరోజు తెల్లవారు జాము నుంచే వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై...
గాయత్రీదేవి అలంకారంతో ఉన్న దుర్గామాతను దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో అన్ని సౌకర్యాలను దేవస్థానం ఏర్పాటు చేసింది. క్యూలైన్‌లలో మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందిస్తుంది. ఈరోజు వంగ, ఆకుపచ్చ, బంగారు రంగు చీరల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తారు. భక్తులు వేగంగా దుర్గమ్మను దర్శించుకునేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.