Telangana : దసరా పండగకు ముస్తాబవుతున్న తెలంగాణ పల్లెలు...పట్టణాలు

దసరాకు తెలంగాణ ముస్తాబవుతుంది. ఈ నెల2వ తేదీ నుంచి బతుకమ్మ పండగ కూడా ప్రారంభమవుతుంది.

Update: 2024-09-28 06:45 GMT

దసరాకు తెలంగాణ ముస్తాబవుతుంది. ఈ నెల2వ తేదీ నుంచి బతుకమ్మ పండగ కూడా ప్రారంభమవుతుంది. తెలంగాణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మొత్తం తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రులకు మాంసాహారాన్ని కూడా ముట్టరు. తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకూ బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. తెలంగాణ ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకత ఉంది. బతుకమ్మ కోసం పూలను తెచ్చి తయారు చేసి ఆటపాటలతో గడుపుతారు.

తొమ్మిది రోజుల పాటు...
ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీన ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు అక్టోబరు పదోతేదీతో ముగియనున్నాయి. చిన్నా పెద్దా అందరూ కలసి ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంప్రదాయంగా వస్తుంది. ఒక్కోరోజు ఒక బతుకమ్మను వివిధ పూలతో తయారు చేస్తారు. చద్దిని తయారు చేసుకుని వచ్చి నైవేద్యంగా పెడతారు. కొన్ని దశాబ్దాల నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. ఎన్ని జనరేషన్ లు మారినా ఆ సంప్రదాయాన్ని మాత్రం ఎవరూ వదలిపెట్టకుండా తాము పాల్గొని జరుపుకుంటున్నారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు.. ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న తెలంగాణ మహిళలు కూడా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు.
వరసగా తొమ్మిది రోజులు...
భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున ఈ బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. దుర్గాష్టమి వరకూ కొనసాగుతాయి. రోజుకొక నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు. వివిధ రకాల నైవేద్యాలతో బతుకమ్మను ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవుతాయి. అక్టోబరు పదోతేదీతో పూర్తి అవుతాయి. ఏరోజుకారోజు బతుకమ్మను పేర్చి కూర్చి మహిళలు తమ ఆటపాటలతో ఆరాధిస్తారు. ఇందుకు ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. చెరువుల్లో కలిపేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేయనుంది.

అక్టోబరు 02 - ఎంగిలిపూల బతుకమ్మ
అక్టోబరు 03 - అటుకుల బతుకమ్మ
అక్టోబరు 04 - ముద్దపప్పు బతుకమ్మ
అక్టోబరు 05 - నానే బియ్యం బతుకమ్మ
అక్టోబరు 06 - అట్ల బతుకమ్మ
అక్టోబరు 07 - అలిగిన బతుకమ్మ
అక్టోబరు 08 - వేపకాయల బతుకమ్మ
అక్టోబరు 09 - వెన్నముద్దల బతుకమ్మ
అక్టోబరు 10 - సద్దుల బతుకమ్మ


Tags:    

Similar News