Indrakiladri : అమ్మవారికి నవరాత్రుల్లో ఏం నైవేద్యం పెడతారో మీకు తెలుసా?
దుర్గగుడి శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
దుర్గగుడి శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తారు. రోజుకో రూపంలో దర్శనమిచ్చే దుర్గమ్మ తల్లి అందరినీ కాపాడే దేవతగా భావిస్తారు. అందుకే శరన్నవరాత్రులకు అంత విశిష్టత ఉంది. శక్తి పీఠాల్లో ఒకటిగా దేశంలో విరాజిల్లే బెజవాడ దుర్గాదేవికి అలంకాలు ఎంత ముఖ్యమో.. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కూడా అంతే ప్రాధాన్యం. అందుకే అమ్మవారికి రోజుకో రంగు చీర కడుతూ వివిధ రకాలుగా నైవేద్యాన్ని సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. నవరాత్రులు చేసుకునే వారెవరైనా ఈ నైవేద్యాలనే దేశ వ్యాప్తంగా తమ ఇళ్లల్లో ఉన్న దుర్గమ్మ తల్లికి సమర్పించడం ఆచారంగా వస్తున్నదే.
పది రోజుల పాటు...
ఈ నెల 3వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. 12 తేదీన జరిగే తెప్పోత్సవం తో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఏ రోజు ఏ నైవైద్యం పెట్టాలనేది ముందుగానే నిర్ణయించి దానిని ప్రత్యేకంగా తయారు చేయిస్తారు రుచిగా, శుచిగా నైవేద్యాన్ని దుర్గమ్మకు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అలాగే నవరాత్రుల్లో ప్రతి రోజూ ఒక రంగు చీర దుర్గమ్మకు ధరింప చేస్తారు. తొమ్మిది అలంకారాలకు తొమ్మిది రకాలు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దుర్గమ్మను దర్శించుకునే వారికి ఈ నవరాత్రుల్లో ఇవి ప్రత్యేకం. ప్రతి ఏడాది శరన్నవరాత్రుల సందర్భంగా చీరతో పాటు నైవేద్యం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా తెప్పించిన చీరలను అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు అలంకరిస్తారు.
చీర రంగు - నైవేద్యాలు...
తొలి రోజు: బంగారు రంగు చీర, కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం నైవేద్యం
రెండో రోజు : లేత గులాబీ రంగు చీర, పులిహోర నైవేద్యం
మూడో రోజు : కాషాయం లేదా నారింజరంగు చీర, కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం నైవేద్యం
నాలుగో రోజు : గంధపురంగు లేదా పసుపురంగు చీర, పరమాణ్ణం, దద్దోజనం, గారెలు నైవేద్యం
ఐదో రోజు : కుంకుమ రంగు చీర, నైవేద్యంగా దద్దోజనం, క్షీరాన్నం నైవేద్యం
ఆరో రోజు : గులాబీ రంగు చీర, చక్కెర పొంగలి, క్షీరాన్నాన్ని నైవైద్యం
ఏడో రోజు : తెలుపురంగు చీర, కేసరి, పరమాన్నం, దద్దోజనం నైవేద్యం
ఎనిమిదో రోజు : ఎరుపు రంగు చీర, కదంబం, శాకాన్నం నైవేద్యం
తొమ్మిదో రోజు : ముదురు ఎరుపురంగు చీర, చక్కెర పొంగలి నైవేద్యం
పదో రోజు : ఆకుపచ్చ రంగు చీర, పులిహోర, లడ్డూ, బూరెలు, గారెలు, అన్నం నైవేద్యం