ఆమంచి అడ్జస్టయ్యారటగా

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చీరాల నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. గ‌తంలో ఇక్కడ నుంచి ఉద్ధండులు విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత యువ నాయ‌కులు [more]

Update: 2020-02-08 15:30 GMT

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చీరాల నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. గ‌తంలో ఇక్కడ నుంచి ఉద్ధండులు విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత యువ నాయ‌కులు తెర‌మీదికి వ‌చ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ ఓ సీనియ‌ర్ మోస్ట్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఎవ‌రు ఉన్నప్పటికీ చీరాల రాజ‌కీయాలు ఎప్పుడూ చ‌ర్చకు వ‌స్తుంటాయి. గ‌త ఏడాది జ‌రిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘ‌న విజ‌యం సాధించినా.. ఇక్కడ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆమంచి కృష్ణమోహ‌న్ మాత్రం ప‌రాజ‌యం పాల‌య్యారు. టీడీ పీ నేత‌, గెలుస్తారా? గెల‌వ‌రా? అని అంద‌రూ అనుకున్న క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు. అయితే, ఇప్పుడు మ‌రోసారి చీరాల రీజ‌కీయం ఆస‌క్తిగా మారింది.

టీడీపీలో ఇద్దరూ ఉన్నా….

విష‌యంలోకి వెళ్తే.. చీరాల‌లో ఉప్పు-నిప్పు మాదిరిగా రాజ‌కీయాలు చేసిన నాయ‌కులు ఇద్దరే ఇద్దరు. వారే టీడీపీ నాయ‌కురాలు బీసీ మ‌హిళ‌ పోతుల సునీత‌, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహ‌న్‌. 2014 ఎన్నిక‌లే వీరి మ‌ధ్య ఉన్న విభేదాల‌కు అద్దం ప‌ట్టాయి. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సునీత‌పై ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ గెలిచారు. ఆ త‌ర్వాత సునీతకు బాబు ఎమ్మెల్సీతో పాటు ఏపీ టీడీపీ మ‌హిళా అధ్యక్షురాలి ప‌ద‌వి క‌ట్టబెట్టారు. ఆ త‌ర్వ ఆమంచి కృష్ణమోహన్ సైతం టీడీపీలోకి వ‌చ్చారు.

గందరగోళం ఏర్పడుతుందని…

ఇక ఈ ఎన్నిక‌ల‌కు ముందు ఆమంచి వైసీపీలోకి జంప్ చేసి టీడీపీ నుంచి పోటీ చేసిన క‌ర‌ణం బ‌ల‌రాం చేతిలో ఓడిపోయారు. క‌ట్ చేస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చింది. అయితే, రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు కాబ‌ట్టి.. ఇప్పుడు సునీత వైసీపీకి జైకొట్టారు. అంటే రెండు ప‌దునైన క‌త్తులు ఒకే ఒర‌లో ఇమ‌డాల్సి వ‌చ్చింది. దీంతో ఆమంచి కృష్ణమోహన్ విముఖత వ్యక్తం చేశార‌ని తెలిసింది. అదే స‌మయంలో చీరాల ఇంచార్జ్ ప‌ద‌వి విష‌యంలోనూ నీలి మేఘాలు క‌మ్ముకున్నాయి. పోతుల సునీత రాక‌తో వైసీపీలో గంద‌ర‌గోళం ఏర్పడుతుందని అంద‌రూ అనుకున్నారు. నిజానికి ఆమె అధికారికంగా కండువా క‌ప్పుకోలేదు.

సయోధ్య కుదిర్చిన…..

కానీ, పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్డీఏ ర‌ద్దు బిల్లుల‌పై టీడీపీ అధిష్టానం జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా సునీత‌ శాస‌న మండలిలో ఓటేశారు. అంటే 71వ రూల్‌పై జ‌రిగిన చ‌ర్చకు ఆమె వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో టీడీపీ నుంచి ఆమె దాదాపు బ‌య‌ట‌కు వ‌చ్చి న‌ట్టే. దీంతో చీరాల వైసీపీలో ఓ సందిగ్ధ వాతావ‌ర‌ణం ఏర్పడింది. ఇప్పుడు పోతుల‌తో ఎలా స‌ర్దుకు పోవాలి? అనే చ‌ర్చ ఆమంచి కృష్ణమోహన్ వ‌ర్గంలో జోరుగా సాగింది. దీంతో క‌లుగ జేసుకున్న జిల్లాకు చెందిన మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇరువురు నేత‌ల మ‌ధ్య స‌యోధ్యకు ప్రయ‌త్నించారు

కుదురకునేనా?

చీరాల నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహనేనని ఆయ‌న ప్రక‌టించి ప్రస్తుతానికి ఆమంచి వ‌ర్గానికి తీపి క‌బురు అందించారు. ఆమంచి నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. అయితే, సునీత పార్టీ కండువా క‌ప్పుకొంటే ఏం జ‌రుగుతుంది? వ‌చ్చే 2024లో ఆమె టికెట్ ఆశిస్తే.. ఎవ‌రికి ఇస్తారు? అనే చ‌ర్చ మాత్రం ప్రస్తుతానికి స‌శేషంగానే మిగిలింది. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఎంత మాత్రం స‌ఖ్యత కుదిరే ఛాన్స్ క‌న‌ప‌డ‌డం లేదు.

Tags:    

Similar News