Revanth Reddy: రేవంత్ రొట్టె విరిగి నేతిలో పడినట్లే... జమిలి ఎన్నికలు కలసి వస్తాయా?

జమిలి ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలసి వచ్చేలా కనిపిస్తున్నాయి.

Update: 2024-09-19 06:22 GMT

revanth reddy in jamili election

జమిలి ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలసి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన అధినాయకత్వం సహకరిస్తే ఆరేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనాసాగేలా అవకాశాలున్నాయి. అయితే జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది మాత్రం ఇంకా తేలకపోయినా.. ఇప్పుడిప్పుడే జరిగే అవకాశం లేదన్నది న్యాయనిపుణుల అంచనా. జమిలి ఎన్నికలు జరపాలంటే అనేక ప్రక్రియలను జరపాల్సి ఉంటుంది. జనగణన దేశ వ్యాప్తంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగనుంది.

అనేక అవరోధాలు...
దీంతో పాటు పార్లమెంటు ఉభయ సభల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ఆమోదించాల్సి ఉంటుంది. ఇది కొంత కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే ఇండియా కూటమి ఇప్పుడు బలంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలను పదిహేను పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అనేక బ్రేకులు జమిలి ఎన్నికలకు అడ్డం కానున్నాయి. అధికారానికి కాల పరిమితి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవు. అవి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి. అనేక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 2029 నాటికి అన్ని సానుకూలిస్తే తప్ప జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు.
భవిష్యత్ లోనూ...
1951 నుంచి 1967 వరకూ దేశమంతా ఒకే సారి ఎన్నికలు జరిగేవి. తర్వాత ప్రభుత్వాలు కూలిపోవడంతో పాటు రాజీనామాలను చేయడం వంటి కారణాలు కూడా వేర్వేరు సమయాల్లో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు భవిష‌్యత్ లో రావన్న గ్యారంటీ లేదు. మనది ప్రజాస్వామ్య దేశం. కేజ్రీవాల్ ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. భవిష్యత్ లో ఇలాంటివి జరగవన్న గ్యారంటీ లేదు. దీనికి తోడు ఆరు రాజ్యాంగ సవరణలు చేయాలి. దేశంలో సగం రాష్ట్రాలు జమిలి ఎన్నికల ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే సమయం చాలా పట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2029 ఎన్నికలకు జమిలి ఎన్నికలు జరిగే అవకాశముంది.
2029 ఎన్నికలు జరిగితే...?
2029 ఎన్నికలు జరిగితే మాత్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి రొట్టె విరిగి నేతిలో పడినట్లే. మరో ఏడాది పదవీ కాలం కలసి వస్తుంది. జమిలి ఎన్నికలు జరపాలంటే మరో ఏడాది పాటు ప్రభుత్వ పాలనను పొడిగించాల్సి ఉంటుంది. అదే జరిగితే రేవంత్ రెడ్డి మరో ఏడాది పాటు అదనంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. నిజానికి తెలంగాణలో 2028లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే జమిలి ఎన్నికలను 2029 లో జరపాలని నిర్ణయిస్తే మాత్రం తెలంగాణకు కూడా మరో ఏడాది పాటు పాలన గడువును పెంపొందించాల్సి ఉంటుంది. మొత్తం మీద జమిలి ఎన్నికలు జరిగితే ఎవరి మాట ఎలా ఉన్నా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి అదనంగా మరో ఏడాది ముఖ్యమంత్రిగా కొనసాగే వీలుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.



Tags:    

Similar News