కసి మీదున్న కమల్ నాథ్.. సింధియాకు సవాలే

మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు ప్రభుత్వాన్ని శాసిస్తాయని మాత్రం చెప్పవచ్చు. [more]

Update: 2020-08-04 18:29 GMT

మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు ప్రభుత్వాన్ని శాసిస్తాయని మాత్రం చెప్పవచ్చు. దీంతో ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. జ్యోతిరాదిత్య సింధియా సత్తా ఏంటో ఈ ఉప ఎన్నికల్లో తేలనుంది. మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దించి భారతీయ జనతా పార్టీ గద్దెనెక్కిన సంగతి తెలిసిందే.

ఆరు నెలలులోగా……

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఆ పార్టీ కొంప ముంచాయి. జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకున్నారు. బీజేపీలో చేరిపోయారు. దీంతో కమల్ నాధ్ బలపరీక్ష నిర్వహించకుండానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆరు నెలల్లోపు శాసనసభకు రాజీనామా చేసిన చోట ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తులు చేస్తుంది.

సింధియాకు సవాలే…..

రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కరోనా సమయం కావడంతో ఈసారి పోలింగ్ శాతం ఎలా ఉంటుందన్న ఆందోళన అన్ని పార్టీల్లో వ్యక్తమవుతోంది. రాజీనామాలు చేసిన వారికి తిరిగి బీజేపీ టిక్కెట్లు ఇవ్వనుంది. వీరిని గెలిపించుకునే బాధ్యత జ్యోతిరాదిత్య సింధియాపైనే ఉంది. ఈ ఉపఎన్నికల్లో కనీసం పదిహేను సీట్లు గెలిస్తేనే మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉండనుంది.

కసిమీదున్న కమల్ నాధ్….

230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ 116 స్థానాలు. బీజేపీకి 109 స్థానాలున్నాయి. అలాగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలను గెలుచుకుంటే తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వీలుంది. దీంతో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్ ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తున్నారు. కొందరికి ముందుగానే అభ్యర్థి అని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మధ్యప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని ఈ ఉప ఎన్నికలు నిర్దేశించనున్నాయి.

Tags:    

Similar News