కెలుక్కుంటే ఇంతే

తమిళనాడులో ప్రస్తుతం ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది. ఎన్నికల్లో వరస ఓటములతో దినకరన్ వర్గం డీలా పడటం, శాసనసభలో తగినంత బలం ఉండటం, కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులుండటంతో పళనిస్వామి [more]

Update: 2019-11-13 17:30 GMT

తమిళనాడులో ప్రస్తుతం ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది. ఎన్నికల్లో వరస ఓటములతో దినకరన్ వర్గం డీలా పడటం, శాసనసభలో తగినంత బలం ఉండటం, కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులుండటంతో పళనిస్వామి ప్రభుత్వం 2021వరకూ సాఫీగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలినాళ్లలో పళనిస్వామి ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నించిన డీఎంకే సయితం నాంగునేరి, విక్రంవాడి ఉప ఎన్నికల్లో ఓటమితో ఇక ఆలోచనలో కూడా లేదు.

తనకు తానే….

ఈ పరిస్థితుల్లో పళనిస్వామి తనకు తానే పార్టీలో అసంతృప్తి కొనితెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పళనిస్వామి ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలను చేపట్టి దాదాపు రెండేళ్లు గడుస్తుంది. తొలినాళ్లలో పన్నీర్ సెల్వం కొంత ఎదురుతిరిగినా బీజేపీ రాయబారంతో ఆయనను కూడా ప్రభుత్వంలోకి చేర్చుకున్నారు. నాడు పళనిస్వామి బలపరీక్షలో పన్నీర్ సెల్వం వ్యతిరేకించినా సరే… ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి పళనిస్వామి గౌరవించారు.

ఇప్పటికే రెండు గ్రూపులు….

అయితే వరసగా పార్లమెంటు, శాసనసభ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే డీలా పడటంతో పళనిస్వామి ఇమేజ్ కూడా కొంత డ్యామేజీ అయింది. పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటినుంచే పళనిస్వామికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టడం మొదలుపెట్టారు. జయలలితకు అసలైన వారసుడిని తానేనని భావించిన పన్నీర్ సెల్వం పదే పదే కేంద్రం పెద్దల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేయడం కూడా పళనిస్వామికి రుచించలేదు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆధిపత్యం తనదే ఉండాలని భావించిన పళనిస్వామి కొంత సర్దుకుపోతున్నా ఇద్దరి మధ్య వివాదాలు నేటికీ సమసి పోలేదనే చెప్పాలి.

విస్తరణ చేపడితే…..

ఈ నేపథ్యంలో పళనిస్వామి మంత్రి వర్గ విస్తరణ చేయాలని భావిస్తుండటం తేనెతుట్టను కదిలించడమేనని చెబుతున్నారు. ఇప్పటి వరకూ తమకు మంత్రి పదవులు రాని వారు సయితం ఈ ప్రచారంతో పళనిస్వామి వద్దకు క్యూ కడుతున్నారు. కొన్ని శాఖలు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు రెండు వర్గాల్లో ఎవరికి ఎన్ని పదవులు దక్కుతాయన్న చర్చ ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ విస్తరణ చేపడితే తమ వర్గీయులకు సయితం పదవులు ఇవ్వాల్సి ఉంటుందని పన్నీర్ సెల్వం సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో తనకు తానే మంత్రి వర్గ విస్తరణ చేపట్టి పళనిస్వామి చిక్కుల్లో పడ్డారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News