సీరియల్ ను తలపిస్తున్న ఆమంచి స్టోరీ

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్యెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టి ఎమ్యెల్యేగా [more]

Update: 2019-02-08 14:00 GMT

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్యెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టి ఎమ్యెల్యేగా గెలిచి టిడిపి కండువా కప్పుకున్న ఆమంచి కృష్ణ మోహన్ ఆ ప్రాంతంలో గట్టి పట్టున్న కాపు సామాజిక వర్గం నాయకుడు. కేబుల్ టివి ఎంఎస్ ఓ గా కూడా మీడియా అంతటిని స్థానికంగా శాసిస్తున్న నాయకుడు. అయితే టిడిపి లో ఆయనకు సరైన ప్రాధాన్యత లేకపోగా గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయినా పోతుల సునీతకు ఎమ్యెల్సీ టికెట్ కేటాయించిన నాటినుంచి ఆయనకు తలపోట్లు మొదలయ్యాయి.

సొంత పార్టీనుంచి ఇంటిపోరు …

తన మాటే శాసనంగా అధికారాన్ని చెలాయించిన ఆమంచికి సొంత పార్టీలోనే విలువ లేని పరిస్థితి ఏర్పడింది. పోతుల సునీతకు ఎమ్యెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా రాష్ట్ర మహిళా విభాగానికి టిడిపి అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టడం తో చాలా కాలంగా అసంతృప్తి తో రగిలిపోతున్నారు. ఈ పరిణామాలను గమనించిన వైసిపి తమ దూతలతో చర్చలు జరిపి వైసిపిలోకి సాదరంగా ఆహ్వానించింది. దాంతో కృష్ణ మోహన్ కార్యకర్తలతో సమావేశం అయ్యి పార్టీలో తనకు ఎదురౌతున్న ఇబ్బందులు ఏకరువు పెట్టి వైసిపి తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

సీన్ లోకి సిద్దా ….

అయితే చీరాల ఎమ్యెల్యే విపక్షంలోకి వెళ్లనున్నారన్న సమాచారం అందుకున్న అధికారా పార్టీ తక్షణమే అలర్ట్ అయ్యింది. ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధ రాఘవరావును రాయబారానికి పంపి ఆమంచిని మెత్తబరిచింది. ముఖ్యమంత్రితో భేటీ తరువాత తన నిర్ణయం తీసుకోవాలని సిద్ధ రాఘవరావు సూచనతో ఆయన పార్టీ మారే విషయంలో తాత్కాలికంగా వెనుకడుగు వేశారు. ముఖ్యమంత్రిని అమరావతిలో కలవడానికి బయల్దేరుతున్నట్లు అనుచరగణంతో చెప్పి మాయమయ్యారు. అయితే అమరావతిలో ఆమంచి జాడ లేకపోవడంతో అటు మీడియా ఇటు ఇంటెలిజెన్స్ ఆయన కోసం వెతుకులాట మొదలు పెట్టాయి.

అమరావతి వస్తానని రామచంద్రాపురంలో ….

ముఖ్యమంత్రిని కలుస్తారనుకున్న ఆమంచి కృష్ణ మోహన్ ఎవ్వరు ఊహించని విధంగా తన మిత్రుడు రామచంద్రపురం ఎమ్యెల్యే తోట త్రిమూర్తులతో భేటీకావడం సంచలనం గా మారింది. పార్టీ మార్పు పై ఇరువురు నేతలు తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. వీరితో బాటు పలువురు కాపు సామాజిక వర్గ నేతలు కూడా చర్చలు జరపడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఏర్పడింది.

చివరకు నిన్న , గురువారం ముఖ్యమంత్రితో సమావేశమయ్యాడు. అతను పార్టీ మారే విషయం ఇప్పటికి సస్పెన్స్ గానే కొనసాగుతుంది.

బాబు సర్కార్ తీరుపై తోట అసంతృప్తి ….

దీనికి తోడు సమావేశం అనంతరం తోట త్రిమూర్తులు ఈ ప్రభుత్వ తీరు ఏమి బాగోలేదంటూ వ్యాఖ్యానించడం టిడిపిలో సంక్షోభాన్ని చెప్పక చెబుతుంది. ముఖ్యమంత్రి తో భేటీ తరువాత తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని ఈ సందర్భంగా ఆమంచి కృష్ణ మోహన్ ప్రకటించడం గమనార్హం. మొత్తానికి ఈ ఇద్దరు కాపు సామాజిక వర్గ ఎమ్యెల్యేలు జనసేన వైపు చేరవచ్చని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఉపద్రవాన్ని రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు ఎలా తిప్పి కొడతారో అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News