ఆయన అంచనాలు ఆయనకున్నాయి

ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారంటారు. డాక్టర్ గా చదివిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ పెద్దల్లుడు అయ్యాక ఆయనలోకి మరో కోణం బయటపడింది. ఆయన సొంత మామగారినే హీరోగా [more]

Update: 2019-10-28 05:00 GMT

ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారంటారు. డాక్టర్ గా చదివిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ పెద్దల్లుడు అయ్యాక ఆయనలోకి మరో కోణం బయటపడింది. ఆయన సొంత మామగారినే హీరోగా పెట్టి రెండు సినిమాలు కూడా తీశారు. ఇక అన్న గారు రాజకీయాల్లోకి వెళ్టున్నపుడు ఆయన వెంట ఉన్నది దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రమే. చిన్నల్లుడు చంద్రబాబు అప్పటికే కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. దాంతో ఆయన కొత్త పార్టీకి రాను పొమ్మన్నారని అంటారు. అలా రాజకీయాల్లొకి మామ పిలుపు మేరకు వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఎన్టీఆర్ ఉన్నంతవరకూ పూలపానుపుగా రాజకీయం నడించింది. పార్టీలో చీలిక సమయంలో తెలిసో తెలియకో ఆయన చంద్రబాబు వెంటే ఉండి తప్పుచేశారని అంటారు. ఆ తరువాత లక్షీపార్వతి టీడీపీలో, బీజేపీ, కాంగ్రెస్ లో ఇలా అనేక పార్టీలు మారిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వారికి చివరి మజిలీ వైసీపీ అనుకోవాలి. ఇపుడు ఆ పార్టీ నుంచి తప్పుకుని రాజకీయాల నుంచే పూర్తిగా విరామం ప్రకటిస్తానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటున్నారు.

ఆమెకే ఫ్యూచ‌రట….

తన రాజకీయాల విషయంలో క్లారిటీ లేకపోయినా భార్య పురంధేశ్వరి ఫ్యూచర్ విషయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి కచ్చితమైన అంచనాలు ఉన్నాయని చెబుతారు. అందుకే ఇంట్లో గృహిణిగా ఉన్న ఆమెను రాజకీయాల్లోకి తెచ్చి కాంగ్రెస్ ఎంపీని చేశారు. తరువాత ఆమె మంత్రి కూడా అయింది. ఇక ఇపుడు బీజేపీలో ఉన్న చిన్నమ్మకు ఆ పార్టీ నుంచి మళ్ళీ ఆదరణ దక్కుతుందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. పైగా జాతీయ పార్టీలో తన భార్య ఉండడమే బెటర్ అని ఆయన ఉద్దేశ్యంగా ఉంది. అందుకే జగన్ వైసీపీలోకి పురంధేశ్వరిని తీసుకురమ్మన్నా కూడా డాక్టర్ గారు అంగీకరించలేదని చెబుతారు. కేంద్రంలో రాజ్యం చేస్తున్న బీజేపీలో ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా చిన్నమ్మకు పెద్ద పీట వేస్తారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనుకుంటున్నట్లుగా సమాచారం.

మళ్ళీ కేంద్ర మంత్రిగా …

ఇదిలా ఉండగా పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చు అని మరో మారు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి చూసుకున్నపుడు జీవీఎల్ నరసింహారావు, రామ్ మాధవ్, సుజనా చౌదరి, పురంధేశ్వరి పేర్లు రేసులో ఉన్నాయట. వీరిలో పురంధేశ్వరి అయితే టీడీపీని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టవచ్చునని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారని టాక్. ఆమె నందమూరి వారి తనయ కావడం ఇక్కడ ప్లస్ అవుతోంది. సుజన చౌదరి మీద కేసులు ఉంటే జీవీఎల్ బ్రాహ్మణ సామాజికవర్గం కావడం మైనస్ అంటున్నారు. రామ్ మాధవ్ కి ఇద్దామనుకుంటే ఆయన కేంద్ర మంత్రి పదవి వద్దు అన్నట్లుగా సమాచారం. మొత్తానికి చిన్నమ్మకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు మోడీ నిర్ణయించారని చెబుతున్నారు. ఈ సమాచారం తెలియబట్టే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి మెల్లగా పక్కకు తప్పుకుంటున్నారని అంటున్నారు. మరి మేడం కోసం ఇలా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పొలిటికల్ కెరీర్ త్యాగం చేయడం గొప్ప విషయమే. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News