సిద్ధూ… కాచుకో.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో గెలిచినా ఓడినా ఆయనకు పెద్దగా పోయిందేమీ లేదు. కేవలం 37 మంది శాసనసభ్యులను మాత్రమే గెలిచి కుమారస్వామి ఏడాదికి [more]

Update: 2019-07-13 16:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో గెలిచినా ఓడినా ఆయనకు పెద్దగా పోయిందేమీ లేదు. కేవలం 37 మంది శాసనసభ్యులను మాత్రమే గెలిచి కుమారస్వామి ఏడాదికి పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. అయితే ఇప్పుడు నెలకొన్న రాజకీయ సంక్షోభానికి భారతీయ జనతా పార్టీతో పాటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణమని కుమారస్వామి బలంగా విశ్వసిస్తున్నారు.

తొలి నుంచి వైరమే….

సిద్ధరామయ్యకు, కుమారస్వామికి తొలి నుంచి పడదు. జనతాదళ్ ఎస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సిద్ధరామయ్య తర్వాత ఆ పార్టీ అధినేత దేవెగౌడతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య బలమైన నేతగా ఎదిగారు. కానీ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించడాన్ని సిద్ధరామయ్య తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

చికాకుగా మారి….

ఇక కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కుమారస్వామికి సిద్ధరామయ్య చికాకుగా మారారనడంలో ఎటువంటి సందేహం లేదు. కుమారస్వామికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో తన వర్గాన్ని ఎప్పటికప్పుడు పరోక్షంగా రెచ్చగొడుతూనే ఉన్నారు. అధికారుల బదిలీల దగ్గర నుంచి నిధుల కేటాయింపుల వరకూ సిద్ధరామయ్య కుమారస్వామిని కంట్రోల్ చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి బయటకు సిద్ధరామయ్యతో చర్చలు జరుపుతున్నా అంతర్గతంగా ఆయనపై కొంత వ్యతిరేకత స్పష్టంగా ఉంది.

ఆయన ప్రోత్సాహంతోనే….

ఇక తాజాగా కాంగ్రెస్ నుంచి రాజీనామాలు చేసిన 13 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. సిద్ధరామయ్య ప్రోత్సాహంతోనే సర్కార్ ను పడేేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది కుమారస్వామి అనుమానం. అందుకే ఆయన బల పరీక్షకు సిద్ధమయ్యారు. బలపరీక్షలో నెగ్గితే సిద్ధరామయ్యకు తానేంటో చెప్పినట్లవుతుంది. అలాగే ఓడినా ఆ నెపం సిద్దరామయ్య పై నెట్టవచ్చన్నది కుమారస్వామి ఆలోచనగా ఉంది. మొత్తం మీద కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతల్లోనే ఆట మొదలయినట్లు కన్పిస్తుంది.

Tags:    

Similar News