తాట తీయాలంటున్నారే

ల‌క్ష్యం పెద్దయిన‌ప్పుడు దానికి త‌గిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవ‌డం అనేది ఎవ‌రికైనా వ‌ర్తిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పెద్ద ల‌క్ష్యాన్ని పెట్టుకున్న ఓ సీనియ‌ర్ వైసీపీ నాయ‌కుడు [more]

Update: 2020-02-15 11:00 GMT

ల‌క్ష్యం పెద్దయిన‌ప్పుడు దానికి త‌గిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవ‌డం అనేది ఎవ‌రికైనా వ‌ర్తిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పెద్ద ల‌క్ష్యాన్ని పెట్టుకున్న ఓ సీనియ‌ర్ వైసీపీ నాయ‌కుడు అంతే ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు సాగుతున్నారు. త‌న‌ప‌ని తాను చేసుకుని పోతున్నారు. ఆయ‌నే నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు నల్లపురెడ్డి ప్రస‌న్నకుమార్ రెడ్డి. గ‌తంలో టీడీపీలో నుంచి వైసీపీలోకి మారిన త‌ర్వాత ఆయ‌న తొలి వైసీపీ ఎమ్మెల్యేగా రికార్డుల‌కు ఎక్కారు. 2012 కోవూరు ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ నుంచి గెలిచారు. ఆ పార్టీకి ఆయ‌నే తొలి ఎమ్మెల్యే. త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ఓడినా ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై విజ‌యం సాదించారు. నిల‌క‌డైన రాజ‌కీయాలు చేస్తూ వివాదాల‌కు దూరంగా ఉంటూ అంద‌రినీ క‌లుపుకొనిపోతున్నారు.

పైచేయి సాధించుకునేందుకు….

నిజానికి నెల్లూరులోని వైసీపీ నాయ‌కుల‌ను తీసుకుంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక వివాదంలో వేలు పెట్టిన వారే. అధికారుల‌పై దౌర్జన్యం. పార్టీలో ఒక‌రి పై ఒక‌రు ఆధిప‌త్యం చ‌లాయించ‌డం, ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు లు చేసుకోవ‌డం వంటివి కామ‌న్‌గా క‌నిపిస్తున్నాయి. అయితే , దీనికి విరుద్ధంగా ప్రస‌న్న కుమార్ రెడ్డి అంద‌రినీ క‌లుపుకుని పోతూ ప్రతి ఒక్కరికీ అండ‌గా ఉంటూ త‌న సొంత అనుచ‌రులే త‌ప్పు చేసినా వారిపై చ‌ర్యలు తీసుకునేలా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక ఇదే జిల్లాలో మంత్రి ప‌ద‌వుల వేట‌లో ఉన్న ఇద్దరు కీల‌క నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

సౌమ్యంగానే ఉంటూ….

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్‌రెడ్డి, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థన్‌రెడ్డి ఇద్దరూ వ‌చ్చే ఏడాది త‌ర్వాత జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో మంత్రి ప‌ద‌విపై క‌న్నేసి ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్నారు. కానీ, ప్రస‌న్నకుమార్ రెడ్డి మాత్రం త‌న ప‌నితాను చేసుకుని పోతున్నారు. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆశ‌యాల‌కు అనుగుణంగా మ‌నం పాల‌కులం కాదు సేవ‌కులం అనే నినాదాన్ని మ‌న‌సా వాచా ఆయ‌న అమ‌లు చేస్తున్నారు. అధికారుల‌తో సౌమ్యంగా ఉంటూ కింది స్థాయి కేడ‌ర్ త‌ప్పు చేసినా స‌రిదిద్దుతూ పార్టీపై ఎలాంటి విమ‌ర్శలూ రాకుండా చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

కార్యకర్తలు వత్తిడి చేసినా…..

నిజానికి కేబినెట్ ఏర్పాటులోనే ఆయ‌న మంత్రి ప‌ద‌విని ఆశించినా అప్పట్లో ఆయ‌న‌కు అవ‌కాశం చిక్కలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రైనా సొంత పార్టీ నేత‌లు త‌ప్పుచేసినా ఊరుకోవ‌డం లేదు. ఇటీవ‌ల ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన ఇద్దరు వైసీపీ కార్యక‌ర్తల‌పైనే ఆయ‌న కేసులు పెట్టించారు. ఇక మ‌రో ప్రభుత్వ ఉద్యోగిని త‌ప్పించాల‌ని వైసీపీ కార్యక‌ర్తలు ఒత్తిడి చేసినా ఎమ్మెల్యే స్వయంగా ఆమె ద‌గ్గర‌కు వెళ్లి ధైర్యం చెప్పివ‌చ్చారు. ప్రస‌న్నకుమార్ రెడ్డి పేరు చెప్పి దందాలు చేసే వైసీపీ నాయ‌కుల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.

జగన్ ను మెప్పించేలా…..

త‌ప్పు ఎవ‌రు చేసినా తాట తీయాల‌ని ఆయ‌న పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయ‌న వ్యవ‌హారం చూస్తోన్న వాళ్లంతా రెండున్నరేళ్ల త‌ర్వాత ఏర్పడే కేబినెట్‌లో త‌న‌కు ఖ‌చ్చితంగా అవ‌కాశం చిక్కేలా ఆయ‌న వ్యూహాత్మకంగా పార‌ద‌ర్శకంగా వేస్తున్న అడుగులు జ‌గ‌న్‌ను సైతం మెప్పించేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News