స్కెచ్ వేస్తే…..చాలట.?

పక్కా వ్యూహం… పకడ్బందీగా పథకం తాపీగా వచ్చారు… అనుకున్న పని చేసేసి వెళ్లారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య విషయంలో మావోయిస్టులు [more]

Update: 2019-09-28 08:51 GMT

పక్కా వ్యూహం… పకడ్బందీగా పథకం తాపీగా వచ్చారు… అనుకున్న పని చేసేసి వెళ్లారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య విషయంలో మావోయిస్టులు అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. సుమారు 50 మంది మావోయిస్టులు. అంతా మహిళలే. వీరంతా రాత్రికి రాత్రే లివిటిపుట్టు సమీపానికి చేరుకుని బృందాలుగా విడిపోయి ఆపరేషన్ సక్సెస్ చేసుకుని వెళ్లిపోయారు. ఇదంతా ఎవరు చేశారు అంటే మావోయిస్టు అరుణ. ఇంతకీ ఆమె ఎవరు….?

చిన్న తనం నుంచే……

ఆంద్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లోని మహిళా మావోయిస్టుల విభాగంలో అరుణ పేరు తెలియని వారుండరు. అసలు అరుణ ఎవరు..? ఉద్యమంలో ఆమె బాధ్యత ఏమిటీ…? అరుణ కోసం కొన్నేళ్లుగా పోలీసు బలగాలు ఎందుకు గాలింపు చేపట్టాయి. అన్న ప్రశ్నలు ఏవోబీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గూడెం కొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్‌కౌంటర్‌లో కూడా ఆమె పాత్రే ఉందని ప్రచారం ఉంది. పోలీసు బలగాలు అరుణకోసం జల్లెడపట్టాయి. పెందుర్తి మండలం సుజాతనగర్‌కు చెందిన అరుణ, ఆమె కుటుంబం కూడా మావోయిస్టుల ఉద్యమం నుంచి ఉన్నారు. అరుణ చిన్న వయసులోనే ఉద్యమానికి ఆకర్షితురాలైంది.

రాంగుడ ఎన్ కౌంటర్ నుంచి…

ఏడాది క్రితం గూడెం మండలం మర్రిపాకల ఎన్‌కౌంటర్లో మృతి చెందిన అగ్రనేత ఆజాద్‌ సొంత చెల్లెలు అరుణ. ఈమె ఫొటో రాంగుడ ఎన్‌కౌంటర్లో లభ్యమైన ల్యాబ్‌ట్యాప్‌లో కనిపించింది. ఆమె పేరు తప్ప ఆమె ఎలా ఉంటుందనేది అప్పుడే వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్‌ చీఫ్‌ అయిన చలపతి భార్యే అరుణ. ప్రస్తుతం అరుణ పార్టీలో కీలక పదవిలో ఉన్నారు. చలపతి భార్య కావడం, తూర్పు మల్కన్‌గిరి డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం ఏకే47 తుపాకీ వాడుతున్నట్లు మాజీ మావోయిస్టుల ద్వారా బయటపడింది.

కిడారి, సోమ హత్యలో కీలకంగా ..

రాంగుడ ఎదురుకాల్పుల నుంచి అరుణ బయట ప్రపంచానికి తెలిసింది. అక్కడి నుంచి అందరి మావోయిస్టుల్లాగే పోలీసులు చూసే వారు. కానీ ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. అప్పటి నుంచి ఏవోబీ, విశాఖ, తూర్పుగోదావరి పోలీసులు ఆమెను ఎలాగైనా పట్టుకోవాలన్న లక్ష్యంతో గాలించారు.

ఆమె ఆచూకీ కోసం …..

మాజీ ఎమ్మెల్యేల హత్య సంఘటనల నుంచి అరుణ కోసం బలగాలు అడవిలో తిరగని రోజు లేదు. ఎప్పుడు దొరుకుతుందా అని తుపాకీలు ఎక్కుపెట్టి ఎదురు చూశారు. ఈ క్రమంలో జీకేవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టుల్లో తొలుత ఆమె ఉందని ప్రచారం సాగింది. ఆమె లేకపోవడాన్ని గుర్తించిన పోలీసు బలగాలు అరుణ కోసం జల్లెడపట్టాయి.

చివరికిలా……..

పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మావోయిస్టు అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో మావోయిస్టు భవానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 22న గుమ్మిరేవుల వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అరుణ, భవానీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 21 నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆ వారోత్సవాలను అడ్డుకునేందకు పథకం రచించారు. దీంతో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ప్రస్తుతం అరుణ, భవానీలు పోలీసుల అదుపులో ఉన్నారు.

 

 

 

Tags:    

Similar News