కదిలించి చూడండి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సత్తా చూపించదలచుకున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. అధిష్టానం తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఫలితాలు ఎలా [more]

Update: 2019-10-07 18:29 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సత్తా చూపించదలచుకున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. అధిష్టానం తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పరోక్షంగా సంకేతాలను పంపుతున్నారు. సిద్ధరామయ్య తనకు వ్యతిరేకంగా పార్టీలో జరుగుతున్న కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వ్యతిరేకత ఉన్నప్పటికీ….

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన గత ఎన్నికల్లోనూ ఒంటి చేత్తో పార్టీని గెలిపించేందుకు పోరాడారు. దేవెగౌడ, యడ్యూరప్ప లకు ధీటుగా ఉన్న ఏకైక నేత సిద్ధరామయ్యే అన్నది అందరూ అంగీకరించే విషయం. అయితే ఇటీవల సంకీర్ణ సర్కార్ కుప్పకూలిన తర్వాత సిద్ధరామయ్యపై పార్టీలో వ్యతిరేకత మొదలయింది. ఆయన ముఖ్య అనుచరులే పార్టీని వీడి వెళ్లిపోయారని, దీని వెనక సిద్ధరామయ్య ఉన్నారన్నది వారి వాదన.

శాసనసభ పక్ష నేత పదవి కోసం…

అందుకే సిద్ధరామయ్యను శాసనసభ పక్ష నేత పదవి నుంచి తొలగించాలని కొందరు ఆయన వ్యతిరేకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, పార్టీలో సీనియర్ నేత హెచ్ కె పాటిల్ శాసనసభ పక్ష నేత పదవి కోసం పోటీ పడుతున్నారు. అధిష్టానం ఈ పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించాలని ఒక దశలో నిర్ణయించింది. జేడీఎస్ తో సంబంధాలు తెగిపోవడానికి సిద్ధరామయ్య కారణమని అధిష్టానం సయితం భావిస్తుంది.

మెజారిటీ సభ్యులంతా….

అయితే సిద్ధరామయ్య పార్టీలో తన పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ అంశంపై చర్చించడానికి ఏఐసీసీ అధినేత మధుసూదన్ మిస్త్రీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. అయితే ఇందులో 52 మంది శాసనసభ్యులు, 29 మంది శాసనమండలి సభ్యులు సిద్ధరామయ్యకు అండగా నిలిచారు. సిద్ధరామయ్యనే ఆ పదవిలో కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. సిద్ధరామయ్య ముందుగానే వీరితో సమావేశమై పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ హైకమాండ్ ను సందిగ్దంలో నెట్టేశారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News