చావును కొని తెచ్చుకోవడమంటే ఇదేనా?

కరోనా వైరస్ వ్యాప్తికి దేశంలో ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్ లు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో చైతన్యం లేకపోవడంతో మరణాల సంఖ్య ఒక్కసారిగా [more]

Update: 2020-03-31 11:00 GMT

కరోనా వైరస్ వ్యాప్తికి దేశంలో ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్ లు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో చైతన్యం లేకపోవడంతో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ రెండు రాష్ట్రాల్లో ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. ఆరుగురు తెలంగాణ లోనే కరోనా కోరలకు చిక్కుకోవడంతో ప్రాణాలు వదిలారు. వీరంతా ఈనెల 13 నుంచి 15 వరకు ఢిల్లీ లో మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే కావడం గమనార్హం. హైదరాబాద్, గద్వాల్ లోని ఆసుపత్రుల్లో వీరంతా మృతి చెందారు. అయితే ఢిల్లీ లో మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే వీరందరూ కావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. దాంతో వారి కుటుంబాలను, క్వారంటైన్ కి తరలించే పనిలో పడ్డారు అధికారులు.

సమాచారం ఇవ్వక ప్రాణంపైకి తెచ్చుకున్నారు…

అలాగే వీరు గత 15 రోజులుగా ఎవరెవర్ని కలిసింది అనేది ఆరా తీస్తున్నారు. గ్లోబల్ ఆసుపత్రి లో వివిధ వ్యాధులతో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తికి పరిక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన అంతకుముందు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారని గుర్తించి ఆదివారం నుంచి ఆయన తో ప్రయాణం చేసిన వారిని గాలిస్తున్నారు. ఇదిలా ఉంటె క్వారంటైన్ కి భయపడి ఢిల్లీ వెళ్లివచ్చిన వారు కరోనా లక్షణాలు ఉన్నా సొంత వైద్యం చేయించుకుని ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. వ్యాధి బాగా ముదిరిపోయిన దశలో ఈ కేసులు ప్రభుత్వం దృష్టిలో పడినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

వేటాడుతున్న తెలుగు రాష్ట్రాలు …

ఏపీ లో కూడా గుంటూరు, కృష్ణా, అనంతపురం,ఒంగోలు ఉభయగోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన వారు ఢిల్లీ లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. వీరందరికోసం పెద్దఎత్తునే పోలీసులు అన్వేషణ మొదలు పెట్టి చాలామందిని క్వారంటైన్ కి తరలించారు. రాజమండ్రి, కాకినాడలో బయటపడిన పాజిటివ్ కేసులు ఢిల్లీ వెళ్ళివచ్చినవారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ఢిల్లీ ప్రార్ధనలకోసం వెళ్ళినవారు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలు చేయించుకుని కుటుంబాలతో సహా క్వారంటైన్ లో ఉండాలని సర్కార్ విజ్ఞప్తి చేసింది. అలాగే వీరిని కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవడం లేదా స్వీయ నిర్బంధం లో ఉంటూ లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతుంది. ఢిల్లీ మత ప్రార్థనలకు రెండు రాష్ట్రాల నుంచి ఎనిమిది వందలమందికి పైగానే వెళ్ళివచ్చివుంటారని భావిస్తున్నారు. దాంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యి మరిన్ని కఠిన చర్యలకు దిగాయి.

Tags:    

Similar News