ఆట కాదు వేట…

ఇదేదో రాజకీయ క్రీడ కాదు. ప్రత్యర్థిని బెదిరించి లొంగదీసుకునే విన్యాసమూ కాదు. పక్కా స్కెచ్. దొరికారో న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సిందే. ఆధారాలుంటే జైలు ఊచలు లెక్కించాల్సిందే. గత [more]

Update: 2019-06-27 14:30 GMT

ఇదేదో రాజకీయ క్రీడ కాదు. ప్రత్యర్థిని బెదిరించి లొంగదీసుకునే విన్యాసమూ కాదు. పక్కా స్కెచ్. దొరికారో న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సిందే. ఆధారాలుంటే జైలు ఊచలు లెక్కించాల్సిందే. గత ప్రభుత్వ తప్పిదాలను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్ కసరత్తు మొదలు పెట్టారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, అవినీతిపై దర్యాప్తనకు ఆదేశాలిచ్చారు. 30 అంశాలపై విచారణకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ తొలి కత్తి దూశారు. రెండు రోజులపాటు జరిపిన జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వెల్లడించిన జగన్ పాత ప్రభుత్వ పాపాలనూ బయటపెడతానంటున్నారు. శాఖలవారీ సమీక్షల్లో భాగంగా లూప్ హోల్స్ ను వెదికి పట్టుకుంటున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులను వదిలేదే లేదని హెచ్చరిస్తున్నారు. సీఎం జగన్ చర్యల్లో పరిపాలనతో పాటు రాజకీయ కోణాలూ దాగి ఉన్నాయి.

తవ్వక తప్పదు…

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆరులక్షల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందంటూ రెండేళ్లుగా వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇందుకు సంబంధించి పుస్తకాలనూ ప్రచురించింది. అసలు అయిదేళ్ల రాష్ట్రప్రభుత్వ బడ్జెట్ లో ఖర్చు చేసిన మొత్తమే అంత లేదంటూ టీడీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కేవలం ప్రభుత్వ నిధుల వ్యయమే కాదు, ఇదంతా ఇన్ సైడ్ ట్రేడింగ్, ఇసుకమాఫియా, సహజవనరుల అక్రమ అప్పగింతల ద్వారా చేతులు మారిన సొమ్ము అంటూ వైసీపీ వాదించింది. అందుకే తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఎంతోకొంత అవినీతిని వెలికితీయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఉబుసుపోక చేసిన విమర్శలుగా గాలికి కొట్టుకుపోతాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశానికి అవే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారతాయి. అందుకే సీఎం జగన్ కొంచెం దూకుడుగానే ముందుకు వెళుతున్నారు. తమపార్టీ తరఫున , సాక్షిపత్రిక తరఫున చేసిన కొన్ని పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వ కుంభకోణాలను వెలికి తీయాలని భావిస్తున్నారు. నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ తాము అవినీతిని ప్రక్షాళన చేసేందుకు కట్టుబడి ఉన్నామని చాటిచెప్పాలనుకుంటున్నారు. అందులోనూ గతంలో తనను వేధించిన అంశాన్ని జగన్ ఇంకా మరిచిపోలేదు. తాను ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినప్పటికీ క్విడ్ ప్రో కో పేరిట కేసులు పెట్టి తనను న్యాయస్థానాల చుట్టూ తిప్పిన సంగతిని ఆయనెందుకు మరిచిపోతారు. అధికారం తన చేతిలో ఉన్నప్పుడు గత సర్కారు లోపాలను విడిచిపెట్టేంత ఔదార్యం ఎందుకు కనబరుస్తారు? అందుకే నెల రోజులు తిరగకుండానే విచారణలకు పూనుకుంటున్నారు.

సంగతి తేల్చే సబ్ కమిటీ….

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే అత్యున్నత స్థాయి విచారణకు కేబినెట్ సబ్ కమిటీని నియమించబోతున్నారు. రాజకీయాంశాలను కూడా ద్రుష్టిలో పెట్టుకుని టీడీపీ ని ఇబ్బందులు పెట్టడం అనేది ఈకమిటీ బాధ్యతల్లో అంతర్భాగం. 30 అంశాలపై విచారణకు సంబంధించిన బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తున్నారు. ఎక్కువభాగం గతంలో వైసీపీ చేసిన ఆరోపణలకు సంబంధించిన అంశాలే. అన్నిశాఖలు ఈ కమిటీకి సహకారం అందించాలి.

ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సంస్థలను దీనికి అనుసంధానించనున్నారు. సాంకేతికంగా అవసరమైన పరిపూర్ణ సమాచారం కమిటీకి తెలియాలనే దర్యాప్తు సంస్థల అధికారులకు సైతం కమిటీలో భాగస్వామ్యం ఉండేలా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ పాత ప్రభుత్వానికి సంబంధించి లోతైన సమాచారాన్ని బట్టబయలు చేయాలనే దృఢ సంకల్పం అయితే కనిపిస్తోంది. ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి పేరిట తాము చేస్తూ వచ్చిన ప్రచారం అతిశయోక్తి అని వైసీపీకి తెలుసు. ఎంతోకొంత అవినీతిని బయటపెట్టి చంద్రబాబును, తెలుగుదేశం వర్గాలను నియంత్రణలో ఉంచాలి. లేకపోతే స్వచ్ఛమైన పాలన అందించినట్లుగా టీడీపీ పదే పదే చెప్పుకుంటున్న మాటలను ప్రజలు విశ్వసించే అవకాశముంది.

టీడీపీకి షాక్…

నిర్మాణ కాంట్రాక్టుల్లో అనధికారికంగా సాగే అక్రమాలను, అవినీతిని వెంటనే పట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే సులభంగా అవినీతిని కనిపెట్టే శాఖలపై సీఎం జగన్ దృష్టి సారించారు. కరెంటు కొనుగోళ్లలో అక్రమాలు సాగినట్లు ప్రాథమిక ఆధారాలు దొరికాయని ప్రభుత్వ వర్గాల సమాచారం.సోలార్, విండ్‌ పవర్‌ కొనుగోళ్లలో మార్కెట్ రేటు కంటే అత్యధిక రేటుకు కొనుగోలు చేయడం ద్వారా ఖజానాకు తూట్లు పొడిచారు, ముడుపులు పొందారనేది ప్రధాన అభియోగం. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని సీఎం జగన్ ప్రశ్నించి దీనిపైనే ప్రధానంగా విచారణ చేయాలని సూచించారు. కేవలం విద్యుత్తు కొనుగోళ్లలో అవకతవకల కారణంగానే ప్రభుత్వ ఖజానాకు రూ. 2636 కోట్లు నష్టం వాటిల్లిందనేది వైసీపీ తోపాటు ప్రభుత్వంలోని కొందరు అధికారుల అంచనా. ఈ డబ్బును బాధ్యుల నుంచి రికవరీ చేయాలని జగన్ ఆదేశించడంలో ఆంతర్యం చంద్రబాబును టార్గెట్ చేయడమే. కేంద్రప్రభుత్వం సైతం సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది. అందువల్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను తిరగదోడితే పెట్టుబడిదారులు దెబ్బతింటారని కేంద్రం కూడా రాష్ట్రానికి సూచించింది. అయినప్పటికీ రాజకీయంగా టీడీపీని దెబ్బతీసేందుకు దొరుకుతున్న అవకాశాన్ని వదిలేందుకు జగన్ ఇష్టపడటం లేదు. అందుకే మొదటి అస్త్రాన్ని విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపైనే ఎక్కుపెడుతున్నారు.

Tags:    

Similar News