లేవనుకుంటుంటే మొదలయ్యాయే?

కర్ణాటకలో కరోనా సమయంలో రాజకీయలు పెద్దగా లేవు. అందరూ కలసి కట్టుగా కరోనాను కట్టడి చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సయితం అన్ని పక్షాలతో [more]

Update: 2020-04-29 17:30 GMT

కర్ణాటకలో కరోనా సమయంలో రాజకీయలు పెద్దగా లేవు. అందరూ కలసి కట్టుగా కరోనాను కట్టడి చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సయితం అన్ని పక్షాలతో చర్చిస్తూ వారి మద్దతును కోరుతూ కరోనా నియంత్రణకు నిర్ణయాలు తీసుకుంుటున్నారు. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ రాజకీయాలు ఉన్నాయని అందరూ భావించారు. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సయితం కరోనా కట్టడికి తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు.

కుమార తనయుడి వివాహంతో….

ఆ తర్వాత కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ వివాహం కొంత వివాదం రేపింది. కరోనా విజృంభిస్తున్న వేళ కుమారస్వామి తన ఫాం హౌస్ లో కుమారుడి పెళ్లి జరిపించడం వివాదంగా మారింది. పెళ్లిలో సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, వందల సంఖ్యలో అతిథులు హాజరుకావడంతో సోషల్ మీడియాలో కుమారస్వామి కుమారుడు వివాహంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో యడ్యూరప్ప దీనిపై విచారణకు ఆదేశించారు. అయితే ఆ తర్వాత నిబంధన ల మేరకే వివాహం జరిగిందని యడ్యూరప్ప తేల్చడంతో ఈ వివాదం అంతటితో ముగిసింది.

పాదరాయనపుర సంఘటనతో…..

కానీ ఇప్పుడు బెంగళూరు నగరంలోని పాదరాయనపురలో జరిగిన సంఘటన రాజకీయాలను కన్నడనాట రాజేసిందనే చెప్పాలి. పాదరాయనపురలో కరోనా అనుమానితులను పరీక్షించడానికి వెళ్లిన ఆశావర్కర్లు, పోలీసులపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ సంఘటనలో 116 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, వారిని రామనగర జైలుకు తరలించారు. ఈ జైలు కుమారస్వామి సతీమణి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది.

ఇద్దరూ ఒక్కటై……

కరోనా హాట్ స్పాట్ గా పాదరాయనపుర ఉంది. రామనగర ప్రాంతం గ్రీన్ జోన్ గా ఉంది. వారిని ఇక్కడికి ఎలా తీసుకువస్తారన్న ప్రశ్నను కుమారస్వామి లేవనెత్తారు. తమపై కక్ష తీర్చుకోవడంలో భాగంగానే వారిని రామనగర జైలుకు తరలించారని కుమారస్వామి ఆరోపించారు. తమకు చెప్పకుండా కరోనా పీడితులను ఈ ప్రాంతానికి ఎలా తీసుకువస్తారని నిలదీశారు. కుమారస్వామికి కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా తోడయ్యారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. దీంతో నిన్న మొన్నటి వరకూ రాజకీయాలు లేవని అనుకుంటున్న కర్ణాటకలో ఈ సంఘటనతో వేడెక్కింది.

Tags:    

Similar News