ఫ్యాక్ట్ చెక్: ఏనుగుల గుంపు రోడ్డు దాటుతున్న వీడియో హైదరాబాద్ కు చెందినది కాదు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం, అందులోని చెట్లను;

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం, అందులోని చెట్లను నరికివేయడం దేశ వ్యాప్తంగా విమర్శలకు కారణమైంది. భారీ నిరసనలకు దారితీసింది. 400 ఎకరాల అటవీ భూమి విశ్వవిద్యాలయానికి చెందినదని విద్యార్థులు వాదిస్తున్నారు, కానీ ప్రభుత్వం తామే ఈ ఆస్తికి యజమాని అని చెబుతోంది. ప్రస్తుతానికి, తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాలలో చెట్లను తొలగించడాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. చెట్ల నరికివేతను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన ఒక రోజు తర్వాత ఈ ఉత్తర్వు సుప్రీం కోర్టు నుండి వచ్చింది.
ఈ పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత వివిధ జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఈ జంతువులు వాటి సహజ ఆవాసాల నుండి బయటకు వచ్చేశాయని, హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్నాయని పేర్కొంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఓ ఏనుగుల గుంపును చూపించే అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఈ ఏనుగులు HCU పరిధిలో నుండి బయటకు వస్తున్నాయని పోస్టులు పెట్టారు. “हैदराबाद से पुरी हाथी फेमली नीकल पडी” అంటూ హిందీలో పోస్టు పెట్టారు. ‘ఏనుగుల కుటుంబం మొత్తం హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నట్లు కనిపిస్తోంది’ అంటూ అందులో తెలిపారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియో హైదరాబాద్ కు చెందినది కాదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతకగా, అదే వీడియోను చూపించే అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు కనిపించాయి. అది శ్రీలంక లోని అంపారాకు చెందినదని పలు కథనాలు తెలిపాయి. ఫిబ్రవరి 23, 2025న నిడివి ఎక్కువ ఉన్న వెర్షన్‌ను షేర్ చేస్తున్న ఫేస్‌బుక్ పేజీని మేము కనుగొన్నాము, “Sri Lanka Ampara Sri Lanka, Elephants Crossing Main Road video 𝘤𝘳𝘦𝘥𝘪𝘵 𝘵𝘰 𝘵𝘩𝘦 𝘳𝘦𝘴𝘱𝘦𝘤𝘵𝘪𝘷𝘦 𝘰𝘸𝘯𝘦𝘳 # #BeautifulDestinations #WanderlustSriLanka # #adventureawaitscookies #travsrilanka #saveelephants” అంటూ పోస్ట్ పెట్టారు.
మరో ఫేస్‌బుక్ యూజర్ 'పెర్ల్ ట్రిప్స్ లంక' అదే వీడియోను పోస్టు చేశారు. శ్రీలంక అడవి అందాలను అనుభవించాలి, శ్రీలంకలోని ఏనుగులను వాటి సహజ ఆవాసాలలో చూడండి. వైల్డ్‌లైఫ్ బుక్ ద్వారా వచ్చిన ఈ ఉత్కంఠభరితమైన వీడియో శ్రీలంకలోని వన్యప్రాణులు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను తెలియజేస్తుందని ఆ పోస్టులో తెలిపారు.
వార్తా నివేదికల ప్రకారం, శ్రీలంకలోని అంపారాలో ఏనుగుల గుంపులు సాధారణంగా కనిపిస్తాయి. Sunday Times.lk లో ఒక నివేదిక ప్రకారం.. సమంతురై ప్రాంతంలో ఏనుగుల గుంపులు తిరుగుతూ ఉంటాయి. వరి కోత జరిగే సమయంలో ఏనుగులు అక్కడకు వచ్చాయి. అటవీ శాఖ ఏనుగులను బుడ్డంగళ అటవీ అభయారణ్యంలోకి తరిమికొట్టడానికి ప్రయత్నించింది. కొన్నిసార్లు 150 కి పైగా ఏనుగులు అక్కడకు వస్తుంటాయని నివేదిక తెలిపింది. ఏనుగులు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అంపారా-కల్మునై ప్రధాన రహదారిని దాటి సాగు ప్రాంతాల వైపు వెళుతున్నట్లు కనిపించాయి. ఆ తర్వాత ఆ ఏనుగులు ఉదయం 10 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాయి.
కాబట్టి, వైరల్ వీడియో హైదరాబాద్‌లోని ఏనుగుల గుంపును చూపించడం లేదు, ఇది శ్రీలంకకు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : HCU దగ్గర పచ్చని ప్రాంతం ధ్వంసం అయిన తర్వాత హైదరాబాద్‌లో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతున్న దృశ్యం
Claimed By : Social media users
Fact Check : False