ఫ్యాక్ట్ చెక్: 21వేల రూపాయలతో 30లక్షలు సంపాదించవచ్చని ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధా మూర్తి చెప్పలేదు
21వేల రూపాయలతో 30లక్షలు;

రచయిత్రి, ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధా మూర్తి తన భర్త నారాయణ మూర్తి వ్యాఖ్యలపై స్పందించారు. ఉత్పాదకతను పెంచడానికి వారానికి 70 గంటలు పనిచేయడాన్ని పరిగణించాలని ఆయన యువతకు చేసిన సూచన వివాదాస్పదమైంది. ఈ సూచన గురించి మొదటిసారి సుధా మూర్తి మాట్లాడారు. ఇన్ఫోసిస్ ప్రారంభ రోజులను, కంపెనీని నిర్మించడానికి చేసిన త్యాగాల గురించి ప్రస్తావించారు. ఇన్ఫోసిస్ విజయంలో మ్యాజిక్ అంటూ ఏమీ లేదని, కేవలం కృషి, అదృష్టం, సరైన సమయంలో సరైన చోట ఉండటం వల్లే సాధ్యమైందని సుధా మూర్తి చెప్పారు. కంపెనీ నిర్మాణాత్మక సంవత్సరాల్లో, నారాయణ మూర్తి, అతని సహచరులు వారానికి 70 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పనిచేశారని ఆమె వెల్లడించారు. లేకపోతే అది సాధ్యం అయ్యేది కాదని ఆమె అన్నారు. తన భర్త ఇన్ఫోసిస్ పట్ల చూపిన అంకితభావానికి మద్దతు ఇవ్వడానికి తాను కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. ఇన్ఫోసిస్‌ను మీరు చూసుకోండి, నేను కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని భరోసా కల్పించానన్నారు.
ఇంతలో సుధామూర్తి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎలాంటి అవగాహన లేకుండా కూడా డబ్బులు సంపాదించవచ్చని సుధా మూర్తి చెప్పడం వినవచ్చు. సుధా మూర్తి పెట్టుబడి వేదిక గురించి మాట్లాడుతూ, మంచి డబ్బులు వస్తాయని హామీ ఇచ్చారు.
వీలైనన్ని ఎక్కువ భారతీయ కుటుంబాలకు సహాయం చేయడానికి రూపొందించిన సరికొత్త వేదిక అని అందులో చెప్పారు. భారతీయుల జీవితాన్ని మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమని చెప్పడం వినవచ్చు. రూ. 21,000 పెట్టుబడి పెట్టి 31 రోజుల్లో రూ. 31,00,000 సంపాదించవచ్చని కోరారు. క్లిప్‌లో సుధా మూర్తి వీడియో కింద అందించిన లింక్‌పై క్లిక్ చేయమని కోరారు.
https://www.facebook.com/
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆడియోను డిజిటల్ గా మ్యానిప్యులేట్ చేశారు.
సుధా మూర్తి ఇలాంటి ప్రకటనలు చేసారేమోనని తెలుసుకోడానికి ప్రయత్నించాం. కానీ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని మేము నిర్ధారించాం.
సుధా మూర్తి వీడియోను అనేక కీలక ఫ్రేమ్‌లుగా విభజించి, రివర్స్ సెర్చ్ చేసాము. మాకు maturedgirl7 అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియో కనిపించింది. వైరల్ వీడియోలోను, ఈ ఇన్స్టా పేజీలోనూ ఓకే చీర ధరించి కనిపించారు. ఆమె కూర్చున్న చైర్, వెనకాల బ్యాగ్రౌండ్ అంతా ఒకటేనని ధృవీకరించాం. ఈ వీడియోను నవంబర్ 30, 2024న పోస్టు చేశారు.
మా తదుపరి పరిశోధనలో Candid chat with Mrs. Sudha Murty about her career, raising kids, secrets of happiness, giving back అనే టైటిల్ తో Nov 19, 2024న The Jaya Show: Unconventional Grassroot Stories అనే యూట్యూబ్ ఛానల్ లో పూర్తీ ఇంటర్వ్యూ లభించింది. ఈ వీడియోను నిశితంగా పరిశీలించాం.. ఎక్కడా కూడా సుధా మూర్తీ వైరల్ పోస్టుల్లో ఉన్నట్లుగా యాప్ ను ప్రమోట్ చేయలేదు.
వైరల్ వీడియోను ఈ వీడియో నుండి క్రాప్ చేసి తీసుకున్నారు.
ఇక వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా సుధా మూర్తి లిప్ సింక్ కు వెనుక వస్తున్న ఆడియోకు ఎలాంటి సంబంధం లేదు. సుధా మూర్తీ మాట్లాడడం ఆపిన తర్వాత కూడా వాయిస్ వినిపిస్తూ ఉండడంతో ఇది డిజిటల్ గా మ్యానిప్యులేట్ చేసిన ఆడియో అని మేము గ్రహించాం.
వైరల్ వీడియోను AI డిటెక్షన్ టూల్స్ ద్వారా పరిశీలించాం. ఈ వీడియోలో ఆడియోను ఏఐ ద్వారా రూపొందించారని నిర్ధారించింది. హైవ్ మోడరేషన్ టూల్ ఈ కంటెంట్‌ను 95 శాతం మ్యానిప్యులేట్ చేశారని నిర్ధారించింది.
కాబట్టి, వైరల్ వీడియోలోని ఆడియోను డిజిటల్ గా మ్యానిప్యులేట్ చేశారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసేలా పలువురు ప్రముఖుల విజువల్స్ ను వాడుకుంటూ, ఏఐ ద్వారా ఆడియోను సృష్టిస్తూ ఉన్నారు. ఇలాంటి మోసపూరిత కంటెంట్ కు దూరంగా ఉండాలని తెలుగుపోస్ట్ కోరుకుంటూ ఉంది.